ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 20: యోగా ప్రాముఖ్యతను గుర్తించిన విదేశీయులు మన దేశానికి వచ్చి యోగా అభ్యాసం చేస్తున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో వెలిసిన యోగా కేంద్రాలకు నేరుగా వచ్చి నేర్చుకుని ఆచరిస్తున్నారు. శరీరంలోని జీవక్రియలను క్రమబద్ధీకరించడంతోపాటు ఎన్ని మందులు వాడినా తగ్గని రక్తపోటు, మధుమేహం వంటి ఎన్నో రోగాలకు యోగా పరిష్కారం చూపుతుందని యోగా నిపుణులు పేర్కొంటున్నా రు. ప్రాణాయామం, ధ్యానం, పంచాక్షరీ యోగాలో ఒక భాగమే. యోగాతో చక్కటి శరీర ఆకృతిని సొంతం చేసుకోవడంతోపాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులు పూర్తి ఏకాగ్రతను సాధించే అవకాశం ఉంటుందని.. వ్యక్తిలోని భావోద్వేగాలను కూడా యోగా నియంత్రణలో ఉంచుతుందని, శరీరం ఉల్లాసంగా ఉండటంతోపాటు మానసిక ఒత్తిడి తొలగిపోతుందని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని.. మెదడులో ప్రాణవాయువు వృద్ధి చెందుతుందని యోగా నిపుణులు వివరిస్తున్నారు.
యోగా తో సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించొచ్చని..చిన్నారుల నుంచి వృద్ధుల వరకు యోగా చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రతి ఏడాది జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎనిమిదో ఎడిషన్‌ను ‘మానవత్వం కోసం యోగా’ అనే థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా యోగా వేడుకలు జరుగనున్నాయి.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. యోగాతో ఎలాంటి వ్యాధులు దరిచేరవు. ప్రతి ఒక్కరూ యోగాను తమ నిత్యజీవితంలో భాగం గా చేసుకోవాలి. నాకు 60 ఏండ్లు వచ్చినప్పటికీ యోగా చేయటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా.
–సలాం, యోగా గురువు