వికారాబాద్, ఫిబ్రవరి 28 : ‘ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో తెలుపాలి.. చిల్లర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్న రేవంత్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు..’ అని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్ హెచ్చరించారు. సోమవారం వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాటాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలను బానిసలుగా చేశారన్నారు. ప్రజలు అభివృద్ధి చెందితే ప్రశ్నిస్తారనే భయంతో ఏండ్ల తరబడి బానిసలను చేశారన్నారని తెలిపారు. చైనాకు స్వాతంత్య్రం వచ్చిన తక్కువ కాలంలో ఎంత అభివృద్ధి జరిగిందో, మన దేశంలో ఎందుకు అభివృద్ధి జరుగలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులే వివరించాలనారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌రెడ్డి తన గన్మెన్లతో ఉద్యమకారులను కొట్టించారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కాని, వికారాబాద్ జిల్లా కోసం ఏ ఒక్క రోజూ ఉద్యమంలో పాల్గొనని రేవంత్‌రెడ్డి… ఈ రోజు మాట్లాడటం అవివేకమన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి రూ.114కోట్లు విడుదల చేశారని, అవి ఎవరి జేబులోకి వెళ్లాయో లెక్కలు చూపాలన్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా పనులు ఎందుకు పూర్తి కాలేవని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ పాల్గొన్నారు.