ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 13 : మండల పరిధిలోని పోల్కంపల్లి అనుబంధ గ్రామమైన మాన్యగూడ గ్రామంలో సోమవారం మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. నాలుగురోజులుగా కొనసాగుతున్న స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలన్నారు. ఆలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ
ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లో పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాల నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషిచేస్తున్నదన్నారు. దూప, దీప, నైవేద్యాలను నిర్వహించేందుకు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రకాశ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మల్లేశ్ ఉన్నారు.
సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం
మంచాల జూన్ 13 : సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల మండలం దాద్‌పల్లి గ్రామానికి చెందిన బాధితుడు నర్సింగ్‌రావుకు ఎమ్మెల్యే రూ.60వేల చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే 2 సంవత్సరాలైనా డబ్బులు వచ్చేవి కావని.. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నవారికి నెల రోజుల్లోనే డబ్బులు అందుతున్నాయన్నారు.
అభివృద్ధి పనులకు నేడు ఎమ్మెల్యే శంకుస్థాపన
పెద్దఅంబర్‌పేట, జూన్ 13 : మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 4, 5వ వార్డులో రూ.1.8 కోట్లతో చేపట్టిన, చేపట్టే పలు సీసీ రోడ్ల నిర్మాణాలు, వైకుంఠధామాలు, పార్కు అభివృద్ధి పనులు, ప్రహరీ నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొననున్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని 4వ వార్డు కౌన్సిలర్ విద్య కోరారు.