ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ జిల్లెడు చౌదరిగూడ మండలంలో
రీ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
కొందుర్గు, జూన్ 13 : రాష్ట్రంలోని గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధిపరచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం జిల్లెడు చౌదరిగూడ మండలం లాల్‌పహాడ్ నుంచి చలివేంద్రం వరకు 3.10 కోట్లతో రీ బీటీ పనులకు, అలాగే చేగిరెడ్డి ఘనాపూర్ చౌరస్తా నుంచి గాలిగూడ గ్రామం వరకు కోటి రూపాయలతో రీ బీటీ రోడ్డు నిర్మాణం పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికి అందేలా చూడాలని ఆయన సూచించారు.
దైవ చింతన అలవర్చుకోవాలి
సమాజంలో ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని గాలిగూడలో సీతారామాంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురాతన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపైనే ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎంపీపీ యాదమ్మ, జడ్పీటీసీ స్వరూప, ఎంపీడీవో మహేశ్‌బాబు, సర్పంచ్‌లు యాదయ్య, బాబురావు, వెంకటస్వామి, పీఎసీఎస్ చైర్మన్ దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, నాయకులు రాములు, కృష్ణయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట
నందిగామ, జూన్ 13 : విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. నందిగామలోని పీహెచ్సీలో డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మెడిసిన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్‌తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మంత్రి సబితారెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి
కడ్తాల్, జూన్ 13 : ఆమనగల్లులో మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. పట్టణంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆమనగల్లులో రూ.5 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు, ఆమనగల్లు మున్సిపాలిటీ, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లోని దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.