సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన ప్రారంభమైంది. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్నారు. ఈనెలాఖరు వరకు త్రీఆర్స్(చదవడం, రాయడం, గణితంలో బేసిక్) నేర్పించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లావిద్యాశాఖ నిర్ణయించింది. ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ సైతం ఇచ్చారు. అయితే పుస్తకాల ముద్రణ కూడా తెలుగు మీడియంతోపాటు ఇంగ్లిష్ మీడియానికి సంబంధించి ఒకే పుస్తకంలో ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది. మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక వసతులను సమకూర్చుతున్నది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 464 స్కూళ్లు, వికారాబాద్ జిల్లాలో 371 స్కూళ్లలో పనులు కొనసాగుతున్నాయి.
రంగారెడ్డి, జూన్ 13(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇప్పటికే మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్న ప్రభుత్వం… సీఎం కేసీఆర్ ఇచ్చిన కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీలో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను అమల్లోకి తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన సోమవారం నుంచి ప్రారంభమైనది.
అయితే ఈ నెలాఖరు వరకు త్రీఆర్స్(చదువడం, రాయడం, గణితంలో బేసిక్స్) నేర్పించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. పుస్తకాల ముద్రణ కూడా పూర్తికాగా, ఈనెలాఖరులోగా పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి తెలుగు మీడియంతోపాటు ఆంగ్ల మాధ్యమానికి సం బంధించి ఒకే పుస్తకంలో ఉండేలా ప్రభుత్వం పుస్తకాలను ముద్రిస్తున్నది. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణను కూడా పూర్తి చేసింది. అదేవిధంగా ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ తెలుగులోనూ విద్యార్థులకు పాఠాలను బోధిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లిష్ బోధనను అందించడంతోపాటు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధన అం దించేలా అధికారులు చర్యలు చేపట్టారు. అయి తే ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులను ఉచితంగా అందిస్తున్నారు.
కార్పొరేట్ బడులకు దీటుగా..
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. ప్రభుత్వ బడులకు మహర్దశ తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నారు. అయితే జిల్లాలో మొదటి విడుతలో ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా లో 1,309 పాఠశాలలుండగా, మొదటి విడుతలో 464 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి, పనులను చేపడుతున్నారు.
అదేవిధంగా బడిబాట కార్యక్రమం కూడా ముమ్మరంగా సాగుతున్నది. స్కూళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను పెంచేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బడిబాటలో భాగంగా ఇం టింటి సర్వే, ర్యాలీలు నిర్వహించి, కరపత్రాల ను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బడీడు పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, ఇంగ్లిష్ మీడియం అమలుపై పిల్లల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల హర్షం
కొడంగల్, జూన్ 13: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ ప్రభు త్వం విశేషంగా కృషి చేస్తున్నది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్క రూ చదువుకోవాలనే సంకల్పంతో ఉచిత బోధనతోపాటు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్‌లను అందిస్తూ మధ్యాహ్నం పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా వికారాబా ద్ జిల్లాలో 371 పాఠశాలల్లో మొదటి విడుతలో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్నది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అందరూ ఆంగ్ల భాషలో రాణించాలనే ఉద్దేశంతో ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను అమలు చేసింది. వికారాబాద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు -764, యూపీఎస్‌లు – 116, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు-174, కేజీబీవీఎస్లు-18, 26 తెలంగాణ గురుకుల పాఠశాలల్లో సోమవారం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభమైనది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు కూడా ఆంగ్ల మాధ్యమాన్ని చదివే సదుపాయాన్ని కల్పించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఆంగ్ల భాషను నేర్చుకుంటా..
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే ఆంగ్ల మాధ్యమం లో బోధనను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడం చాలా సం తోషంగా ఉంది. ఇప్పటి వరకు తెలు గు మీడియంలో చదువుకున్నా. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియంలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విని ఆ భాషను నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంది.
-బన్ని, ఏడోతరగతి, యూపీఎస్ ఎనికేపల్లి, బొంరాస్‌పేట మండలం
చాలా సంతోషంగా ఉంది
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను అమలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ప్రైవేటు పాఠశాలల్లో చదివే నా స్నేహితుల మాదిరిగా ఆం గ్ల భాషలో మాట్లాడాలని ఉంది. టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటా.
-టి.స్వాతి, ఎనిమిదోతరగతి, యూపీఎస్ ఎనికేపల్లి, బొంరాస్‌పేట మండలం