షాద్‌నగర్ రూరల్, జూన్ 13: ప్రభుత్వ వైద్యు లు, సిబ్బంది ఎప్పుడు రోగులకు అందుబాటు లో ఉండి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ హెచ్చరించారు. మాజీ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అతడి భార్య డాక్టర్ చందనపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానను సందర్శించినట్లు తెలిపారు.
మాజీ సూపరింటెండెంట్, శ్రీనివాస్, వైద్యురాలు చందన రోగుల నుంచి డబ్బులు వసూలు చేశారని, విధు ల్లో నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు తమ దృష్టికి రావడంతో ఇక్కడికి వచ్చి వైద్య సిబ్బంది, రోగుల నుంచి వివరాలను సేకరించినట్లు తెలిపారు. త్వరలోనే విచారణ కమిటీ వేసి నిజాలను వెల్లడిస్తామన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమైతే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట వైద్యాధికారులు ఉన్నారు.