రంగారెడ్డి, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బతుకుదారి చూపుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు పథకం రంగారెడ్డి జిల్లాలో వేగంగా అమలవుతున్నది. తొలి విడుతలో జిల్లాలో 698 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా, ఇప్పటికే 483 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.48.30 కోట్లు జమయ్యాయి. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.10 వేల చొప్పున రూ.48.30 లక్షలను రక్షణ నిధికి కేటాయించారు. డబ్బులు జమ అయిన వారిలో 240 మందికి సంబంధించి గ్రౌండింగ్ పూర్తై యూనిట్లను సైతం అందజేశారు. వీరు ఎంచుకున్న యూనిట్లపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ సైతం ఇచ్చారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన యూనిట్లలో అధికంగా మినీ డెయిరీలు, పౌల్ట్రీ ఫాంలు, వాహనాలే అధికంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో చకచకా దళితబంధు పథకం అమలవుతుండడంతో దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో దళితబంధు పథకం అమలు వేగంగా జరుగుతున్నది. జిల్లాలో దళిత బంధు పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను అందజేసే ప్రక్రియ వేగవంతమైంది. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి ఇప్పటికే ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు. దళిత బంధు లబ్ధిదారులు వారు ఎంచుకున్న వ్యాపారాల్లో ఏ విధంగానైనా నష్టపోయినట్లయితే వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రక్షణ నిధి కింద ఇప్పటివరకు రూ.48.30 లక్షల నిధులను సంబంధిత అధికారులు జమ చేశారు.
మరోవైపు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 698 మంది లబ్ధిదారులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. జిల్లాకు రూ.69.80 కోట్ల నిధులు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.48.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో షాద్‌నగర్ నియోజకవర్గంలో 100 మంది, మహేశ్వరంలో 100, చేవెళ్లలో 82, ఇబ్రహీంపట్నంలో 100, ఎల్బీనగర్లో 81, కల్వకుర్తిలో 63, రాజేంద్రనగర్‌లో 100, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 72 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
240 మంది లబ్ధిదారులకు గ్రౌండింగ్
జిల్లావ్యాప్తంగా దళిత బంధు యూనిట్లు అందజేసే ప్రక్రియ వేగవంతమైంది. జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు వారు ఎంచుకున్న యూనిట్లను అందజేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 240 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో 46 మంది, ఇబ్రహీంపట్నంలో 35, ఎల్బీనగర్లో 30, మహేశ్వరంలో 35, రాజేంద్రనగర్‌లో 57, షాద్‌నగర్ నియోజకవర్గంలో 37 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు. వారం రోజుల్లో కల్వకుర్తి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ చేసిన యూనిట్లలో ఎక్కువగా మినీ డెయిరీలు, పౌల్ట్రీ ఫాంలు, వాహనాలను ఎంపిక చేసుకున్నారు.
జిల్లాకు ఇప్పటివరకు రూ.48.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. సంబంధిత నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సంబంధిత అధికారులు జమ చేశారు. జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో 698 మంది లబ్ధిదారులకుగాను 483 మంది లబ్ధిదారులకు సంబంధించి ఇప్పటికే డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. గ్రౌండింగ్ ప్రక్రియను ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోనే చేపట్టి లబ్ధిదారులకు స్థానికంగానే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రాల్లో యూనిట్లను పంపిణీ చేస్తున్నారు.
ఇప్పటికే రూ.10 లక్షల చొప్పున జమ అయిన లబ్ధిదారులకు సంబంధించి చేవెళ్ల నియోజకవర్గంలో 57 మంది, ఇబ్రహీంపట్నంలో 58, కల్వకుర్తిలో 55, ఎల్బీనగర్లో 31, మహేశ్వరంలో 77, రాజేంద్రనగర్‌లో 92, షాద్‌నగర్‌లో 70, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 43 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున కలెక్టర్ బ్యాంకు ఖాతా నుంచి జమ చేశారు. మరోవైపు ఇప్పటివరకు రక్షణ నిధి కింద రూ.48.30 లక్షల నిధులు జమయ్యాయి.
కోరుకున్న యూనిట్ల గ్రౌండింగ్ కలెక్టర్ అమయ్‌కుమార్
దళిత బంధు పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు సంబంధించి వారు కోరుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చేశాం. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల మేరకు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను చేపట్టాం. లబ్ధిదారులకు ఇబ్బంది కలుగకుండా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోనే యూనిట్లను అందజేస్తున్నాం. రక్షణ నిధికి ప్రత్యేకంగా ఒక్కో యూనిట్ నుంచి రూ.10వేలను రక్షణ నిధిలో జమ చేస్తున్నాం.