ఇబ్రహీంపట్నం, జూన్ 12 : రంగారెడ్డి జిల్లాలో టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. పరీక్ష నిర్వహణ కోసం 161 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలను నిర్వహించారు. పేపర్-1 పరీక్ష కోసం 89, పేపర్-2 కోసం 72 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-1కు 21,264 మంది అభ్యర్థులకు 17,449, పేపర్-2కు 17,583 అభ్యర్థులకు 14,321 మంది పరీక్షకు హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వసతులను అధికారులు కల్పించారు. సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
41 సెంటర్లలో 9,168 పరీక్ష రాసిన అభ్యర్థులు
కొడంగల్, జూన్ 12 : వికారాబాద్ జిల్లా పరిధిలో వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గ కేంద్రాల్లో 41 సెంటర్లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 9,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి 9,168 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.
పరీక్షా కేంద్రం తనిఖీ
కొడంగల్, జూన్ 12 : జిల్లాలోని 24 సెంటర్లో నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు వికారాబాద్ కలెక్టర్ నిఖిల తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంగం లక్ష్మీబాయి బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టెట్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష జరుగుతున్న తీరును, హాజరు శాతం, కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా వివరాలు, ఓ.ఎం.ఆర్ షీట్, పేపర్ కోడ్ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష అనంతరం పత్రాలను పూర్తి బందోబస్తుతో తరలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తంగా 5740 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 5569మంది హజరు కాగా 171 మంది గైర్హాజరు కాబడినట్లు కలెక్టర్కు సంబంధిత అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జల్లా విద్యాధికారి రేణుకాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.