ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 12 : తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగా ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి అటవీ శాఖ అంతా సిద్ధం చేసింది. వర్షాలు పడగానే మొక్కలను నాటేందుకు అటవీశాఖ ఆద్వర్యంలో హరితవనం నర్సరీల్లో మొక్కలను సిద్దంగా ఉంచారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అటవీశాఖ ఆధ్వర్యంలో 15 నర్సరీల్లో 30 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. నియోజకవర్గంలోని ఎలిమినేడు, కర్ణంగూడ, దండుమైలారం, పోల్కంపల్లి, నాగన్‌పల్లి, మంచాల, చిత్తాపూర్, జాపాల, రంగాపూర్, నోముల, ఎల్లమ్మతండా, ఆగాపల్లి, గున్గల్, గడ్డమల్లయ్యగూడ, అనాజ్‌పూర్ గ్రామాల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దట్టమైన అడవులను పెంచే విధంగా అటవీ ప్రాంతాల్లో వివిధ రకాల మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం ఇవ్వడంతో డివిజన్లో గత ఏడు విడుతల్లో సుమారు ముప్పైలక్షల మొక్కలను నాటి వాటికి క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ సంరక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఎనిమిదో విడుత హరితహారంలో 30లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన వెంటనే మొక్కలను నాటేందుకు ఖాళీ స్థలాలను ఎంచుకున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో అధిక శాతం మొక్కలు నాటాలన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీల్లో వేప, కానుగ, నేరేడు, రావి, మర్రి, మద్ది, చింత, చీమచింత, బూరుగ, బహున్య, ఉసిరి, సీతాఫలం, రేల, ఏగిస, ఎర్రచందనం, రోజ్‌హుడ్, జమ్మి, మారెడు, వెదురు, కచ్చకాయలతో పాటు వివిధ రకాల మొక్కలను సిద్ధంగా ఉంచారు.