షాబాద్, నవంబర్ 22 : టమాటా పంటలు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ఏడాది పొడవునా సాగు చేసే టమాటా సీజన్‌ను బట్టి మార్కెట్లో ధర పలుకుతుంది. ఒక్కో సమయంలో కిలో రూ.10 పలికే టమాటా ప్రస్తుతం రూ.80 వరకు పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని రైతులు అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కూరగాయల సాగులో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపి సాగు చేసే టమాటాతో రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5,700 ఎకరాల్లో టమాటా సాగు చేసినట్లు సంబంధిత ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో టమాటాకు మంచి డిమాండ్ ఉంది. 20కిలోల బాక్సు టమాటా రూ. 1500 ధర పలుకుతున్నది. ఒక్కో రైతు రోజుకు 20-25బాక్సుల వరకు పంట దిగుబడిని మార్కెట్లో విక్రయిస్తున్నారు.
5,700 ఎకరాల్లో టమాటా సాగు
జిల్లాలోని షాద్‌నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్(కల్వకుర్తి)నియోజకవర్గాల పరిధిలో ఈ ఏడాది వానకాలం సీజన్‌కు 5,700 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. కొన్ని ప్రాంతాల్లో టమాటా దిగుబడులు ప్రారంభమయ్యాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. రోజుకు ఒక్కో రైతు రూ.10వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఎకరం పొలంలో టమాటా సాగుకు రూ. 60వేల వరకు ఖర్చు కాగా, రూ.4లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.
మార్కెట్ సదుపాయం అనుకూలం..
పండించిన కూరగాయలను ఇబ్బందులు లేకుండా మార్కెట్‌కు తరలిస్తున్నారు. చేవెళ్ల, షాద్‌నగర్, శంషాబాద్ మార్కెట్లతో పాటు గుడిమల్కాపూర్ మార్కెట్‌కూ కూరగాయలను తరలిస్తున్నారు. దళారుల వ్యవస్థ లేకుండా నేరుగా తెల్లవారుజామున 5గంటల వరకు వాహనాల్లో మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. టమాటాకు మంచి ధర వస్తుండడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
టమాటాకు మంచి ధర…
మార్కెట్లో టమాటాకు మంచి ధర పలుకుతున్నది. ఎకరం పొలంలో టమాటా సాగు చేశా. రోజుకు 20 బాక్సుల వరకు దిగుబడి వస్తున్నది. బాక్సు ధర రూ.1500 ఉన్నది. చేవెళ్ల మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నా. ఎకరం సాగుకు రూ.60వేల ఖర్చు పోనూ, రూ. 3.50లక్షల వరకు ఆదాయం వస్తున్నది.
రైతులకు మంచి లాభాలు..
కూరగాయల సాగులో మంచి లాభాలు వస్తున్నాయి. రెండు ఎకరాల్లో టమాటా, వంకాయ సాగు చేశా. 20రోజులుగా టమాటా దిగుబడి వస్తున్నది. రోజుకు 15బాక్సులు తీసుకెళ్తున్నా. రూ.10వేల వరకు ఆదాయం వస్తున్నది. మార్కెట్ సదుపాయం అనుకూలంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేవు.