ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 22: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం డీసీఎంఎస్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనేందుకు మొండి వైఖరి అవలంబిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశంతో ప్రతి గింజాను ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిం చి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి ఇబ్రహీంప ట్నం అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బూడిద నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి సభ్యుడు మోహన్‌రెడ్డి, ఏవో వరప్రసాద్‌రెడ్డి, ఏఈవో రఘు, డీసీఎంఎస్ డైరెక్టర్ జంగయ్య, డీసీఎంఎస్ అధికారులు పాల్గొన్నారు.
రైతులు వినియోగించుకోవాలి
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కార్యదర్శి సరోజతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో గుర్తించిన అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సూపర్వైజర్ శ్రీశైలం, రైతులు పాల్గొన్నారు.
దళారులను నమ్మొద్దు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మోకిలా, శంకర్పల్లి పీఏసీఎస్ చైర్మన్లు గోపాల్, శశిధర్‌రెడ్డి అన్నారు. సోమవారం వారు మోకిలా గ్రామ శివారులోని రైతువేదిక వద్ద కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో రాయదుర్గం పీఏసీఎస్ చైర్మన్ అరవింద్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సురేశ్‌బాబు, రామ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు అడివయ్య, నర్సింహులు, మోహన్‌రెడ్డి, చంద్రప్రకాశ్‌రెడ్డి, రాజేశ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ధాన్యం పరిశీలన
రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య అన్నారు. సోమవారం ఆయన టీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డితో కలిసి కొహెడ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. తొర్రూర్‌లో కొహెడ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు, అక్కడ రైతులు తమ పంటను ఆరబోసుకునేందుకు వసతులు కల్పించామన్నారు.