పరిగి, మే 31 : వికారాబాద్ జిల్లా కులకచర్లలోని శ్రీ రామలింగేశ్వర ఎఫ్‌పీవో లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘అనంతగిరి మ్యాంగోస్’ బ్రాండ్ పేరుతో తొలిసారిగా ఢిల్లీకి ఎగుమతులను మంగళవారం మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. ప్రత్యేక ప్యాకింగ్, లేబుల్ పేరిట 5 కిలోల బాక్సుల్లో మామిడికాయలను పంపిస్తున్నారు. రైతులకు లాభం చేకూరేలా మార్కెట్ ధరను చెల్లించి బేనిసాన్ హైదరాబాద్ ద్వారా ఎగుమతి చేయిస్తున్న మహిళా రైతు ఉత్పత్తిదారులకూ ఆదాయం రానున్నది. రైతుల నుంచి ఎలాంటి ట్రాన్స్‌పోర్టు చార్జీలు, హమాలీ ఖర్చులను తీసుకోవడం లేదు. ఈ మామిడికాయలను విక్రయించేందుకు ఢిల్లీలోని ధుని స్టార్టప్ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోనూ ప్రత్యేక స్టాల్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో 20 మెట్రిక్ టన్నుల మామిడికాయలను ఢిల్లీకి ఎగుమతి చేసేందుకు ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచారు.
మామిడి రైతులకు మంచి ధర లభించడంతోపాటు మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థకు ఆదాయం చేకూరే విధంగా వికారాబాద్ జిల్లా నుంచి ఢిల్లీకి మామిడిపండ్లు ఎగుమతులు చేపడుతున్నారు. జిల్లా పరిధిలోని శ్రీ రామలింగేశ్వర ఎఫ్‌పీవో లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘అనంతగిరి మ్యాంగోస్’ పేరిట మామిడిపండ్లు ప్యాక్ చేసి ఢిల్లీకి ఎగుమతులు చేస్తున్నారు. గత మూడేండ్లుగా మామిడి రైతులకు మద్దతు ధర లభించేలా సెర్ప్, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో మామిడి ఎగుమతులు ప్రోత్సహిస్తున్నారు.
2020లో 106 మెట్రిక్ టన్నుల మామిడికాయలను హైదరాబాద్‌కు చెందిన బేనిషాన్, కృషి యోగ్ ద్వారా గుజరాత్, ఢిల్లీకి మామిడికాయలు ఎమగుతి చేశారు. 2021లో 56 మెట్రిక్ టన్నుల మామిడికాయలను బేనిషాన్ హైదరాబాద్ ద్వారా ఎగుమతి చేసి, ఎగుమతి చేసే రోజే పండ్ల మార్కెట్లో ఉన్న ధరను రైతులకు అందించారు. తద్వారా ట్రాన్స్‌పోర్టు, హమాలీ ఖర్చులు లేకుండా మామిడి రైతులు పండ్ల తోటల నుంచే వారు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయడంతో రైతులకు లాభం చేకూరింది. ఈ సీజన్ చివరి దశకు చేరుకుంటుండడంతో 20 మెట్రిక్ టన్నుల మామిడికాయలను ప్యాక్ చేసి మరీ ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నారు.
బ్రాండ్ పేరిట ఎగుమతులు
గతంలో వికారాబాద్ జిల్లా నుంచి మామిడికాయలు ఎగుమతులు జరిగినా ఈసారి రాష్ట్రంలోనే తొలిసారిగా కులకచర్లలోని శ్రీ రామలింగేశ్వర ఎఫ్‌పీవో లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘అనంతగిరి మ్యాంగోస్’ బ్రాండ్ నేమ్‌తో ఎగుమతులు ప్రారంభించారు. ప్రత్యేకంగా ప్యాకింగ్, లేబుల్ ద్వారా మామిడి ఎగుమతులు చేపడుతున్నారు. ‘అనంతగిరి మ్యాంగోస్’ పేరిట ప్రత్యేకంగా 5 కిలోలు మామిడికాయలు పట్టే విధంగా ప్రత్యేకంగా బాక్సులు సైతం తయారు చేయించి నేరుగా పండ్లతోటల వద్ద ప్యాకింగ్ చేసి ఢిల్లీకి పంపిస్తారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని రామలింగేశ్వర ఎఫ్‌పీవో, మోమిన్‌పేట్‌లోని అనంతగిరి ఎఫ్పీసీ, తాండూరు మహిళా ఎఫ్పీసీ, బొంరాస్‌పేట్ మహిళా ఎఫ్పీసీల ద్వారా మామిడి రైతుల నుంచి మామిడికాయలు కొనుగోలు చేయించి నేరుగా ఢిల్లీకి పంపిస్తున్నారు.
ధుని స్టార్టప్‌తో ఒప్పందం..
ఢిల్లీలో అనంతగిరి మ్యాంగోస్ పేరిట మామిడికాయలు విక్రయించేందుకు ధుని స్టార్టప్‌తో ఒప్పందం చేసుకున్నది. తద్వారా ధుని సంస్థకు సంబంధించిన వారే ప్రత్యేక వాహనంలో వికారాబాద్ నుంచి ఢిల్లీకి మామిడికాయలు తీసుకువెళ్లి అక్కడ విక్రయిస్తారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సైతం మామిడికాయల విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో స్టాల్ ఏర్పాటుకు కలెక్టర్ తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్‌కు లేఖ రాసినట్లు సమాచారం.
వినియోగదారుడికి నాణ్యమైన మామిడి
ఎఫ్‌పీవో ద్వారా ఢిల్లీకి మామిడిపండ్లు ఎగుమతి చేయడం ద్వారా మామిడి రైతులకు లాభం చేకూరనున్నది. మహిళా రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో మామిడి రైతుల వద్ద మామిడికాయలను కోసే రోజు పండ్ల మార్కెట్లోని ధరకు కొనుగోలు చేస్తారు. మామిడితోటలో కాయలు తెంపి ప్రత్యేక బాక్సుల్లో పెట్టి వాహనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్థలానికి తీసుకువెళ్లి 5 కిలోల చొప్పున ప్యాక్ చేస్తారు. దీంతో వినియోగదారులకు నాణ్యమైన మామిడిపండ్లు అందుతాయి. మధ్య దళారులు లేకుండా ఈ వ్యవస్థ కొనసాగింపులో సెర్ప్, ఉద్యానవన శాఖ అధికారులు సంయుక్తంగా చేసిన కృషి సత్ఫలితాలు ఇస్తున్నదని చెప్పవచ్చు.
మొదటిసారి ఎగుమతులు
శ్రీ రామలింగేశ్వర మహిళా రైతు ఉత్పత్తి సంస్థ ద్వారా రైతుల నుంచి మామిడిపండ్లు కొనుగోలు చేసి ఢిల్లీకి ఎగుమతులు చేయనున్నారు. ప్రత్యేక బ్రాండ్ పేరిట, లేబుల్, ప్యాకింగ్‌తో కూడిన ఎగుమతులు ఇవే మొదటిసారి. ఢిల్లీలో ధుని స్టార్టప్ సంస్థ ద్వారా విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈసారి ప్రత్యేకంగా ‘అనంతగిరి మ్యాంగోస్’ పేరిట ఎగుమతులు చేపడుతున్నాం.
– ఎస్.శ్రీనివాస్, డీపీఎం, వ్యవసాయ జీవనోపాదులు, ఫుడ్ ప్రాసెసింగ్