షాద్నగర్టౌన్, మే 31: ధూమపానంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయాన్ని అందరూ గ్రహించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి సూచించారు. ప్రపంచ ధూమపాన నివారణ దినం సందర్భంగా మంగళవారం డిప్యూటీ డివిజన్ డీఎంహెచ్వో దామోదర్ ఆధ్వర్యంలో షాద్నగర్ ప్రభుత్వ దవాఖాన నుంచి పట్టణ ముఖ్య కూడలి వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న అనంతరం ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి హాజరై మాట్లాడారు.
పొగ తాగేవారితో పాటు దానిని పీల్చడం ద్వారా చుట్టూ ఉన్నవారి ఆరోగ్యంపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపుతుందన్నారు. ధూమపానంతో నోరు, గొంతు, కడుపు, ఊపిరితిత్తులు, మూత్రవ్యవస్థలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. ధూమపానంతో కలిగే ఆరోగ్య సమస్యలు, నష్టాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యాధికారులు మాట్లాడుతూ.. చిన్న, పెద్ద తేడా లేకుండా ధూమపానానికి బానిసలవుతున్నారన్నారు. అంతకు ముందు పట్టణ ముఖ్యకూడలిలో మానవ హారంగా ఏర్పడి అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో జిల్లా ఎంసీడీ ఆఫీసర్ డాక్టర్ సాల్మన్, డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్ శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఆప్తాల్మిక్ ఆఫీసర్ శ్రీహరి, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, ఫార్మాసిస్ట్ ఉదయ్, మండల హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.