పరిగి, మే 30 : ఓ మొబైల్ షాపు యజమాని బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.18.52కోట్లు జమవడం సంచలనం సృష్టించింది. హెచ్డీఎఫ్సీ బ్యాం కు ఖాతాదారులకు సంబంధించిన ఖాతాలలో దేశ వ్యాప్తంగా పలుచోట్ల కోట్లాది రూపాయలు జమయ్యాయి. అదే విధంగా వికారాబాద్‌కు చెందిన మొబైల్స్ షాపు యజమాని వెంకట్‌రెడ్డికి సంబంధించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో శనివారం రాత్రి రూ.18.52కోట్లు జమ కావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ పట్టణంలోని సెవెన్ హిల్స్ మొబైల్ దుకాణం యజమాని పి.వెంకట్‌రెడ్డికి వికారాబాద్‌లో గల హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా ఉన్నది. శనివారం రాత్రి అతని ఖాతాకు రూ.18.52 కోట్లు జమైనట్లుగా మెసేజ్ వచ్చింది. దీన్ని పరిశీలించిన వెంకట్‌రెడ్డి షాక్‌కు గురయ్యాడు.
మరోవైపు తన బ్యాంకు ఖాతా మైనస్‌లోకి వెళ్లిందేమో అని అనుకున్నారు. ఆదివారం ఉదయం తన ఖాతా నుంచి రూ.50వేలు మరొకరి ఖాతాకు బదిలీ చేశాడు. దీంతో తన ఖాతాకు పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యాయని, అందువల్లే రూ.50వేలు ట్రాన్స్ఫర్ చేయగలిగానని అనుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే సంబంధిత ఖాతాలోకి డబ్బులు వేయడం లేదా, ఇతర ఖాతాలలోకి ట్రాన్స్ఫర్ కాకుండా ఖాతా హోల్డ్‌లోకి వెళ్లింది. దీంతో ఆందోళన చెందిన వెంకట్‌రెడ్డి తన ఖాతాను ఎవరైనా హ్యాక్ చేశారేమోనని భయాందోళనతో బ్యాంకులో తనకు పరిచయం ఉన్న వ్యక్తులకు విషయం తెలియజేయగా ఆదివారం సెలవురోజు కావడంతో కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
దీంతో వెంకట్‌రెడ్డి కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేసి తన బ్యాంకు ఖాతాలోకి రూ.18.52కోట్లు జమయ్యాయని, తనకు సంబంధించి సైతం రూ.2లక్షలు పైగా డబ్బులు ఉన్నాయని, ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్యాంకు ఖాతా హోల్డ్‌లోకి వెళ్లిందని తెలియజేయగా తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని సోమవారం ఉదయం ఆధార్‌కార్డు, గుర్తింపుకార్డు తీసుకువెళ్లి బ్యాంకు మేనేజర్‌ను కలవాల్సిందిగా వారు సూచించారు. దీంతో సోమవారం ఉదయం వెంకట్‌రెడ్డి వికారాబాద్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్‌ను పవన్‌ను కలిసి విష యం తెలియజేశాడు.
వికారాబాద్ బ్రాంచ్‌లో ఎలాంటి తప్పు జరగలేదని, హెచ్డిఎఫ్సీ బ్యాంకు హెడ్ ఆఫీసులో సాంకేతికంగా తప్పు జరగడంతో పెద్ద మొత్తంలో డబ్బులు పలువురి ఖాతాల్లోకి వెళ్లాయని అందువల్లే ఖాతాను హోల్డ్‌లో పెట్టారని, రెండుమూడు రోజుల్లో ఖాతా ద్వారా లావాదేవీలు జరిపేందుకు హోల్డ్ తీసివేయడం జరుగుతుందని బ్యాంకు మేనేజర్ చెప్పారు. ఏదిఏమైనా ఒక్కసారిగా రూ.18.52కోట్లు తమ ఖాతాలో జమవడం వెంకట్‌రెడ్డి కుటుంబాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.