ఆమనగల్లు,నవంబర్19 : రాష్ట్రంలో మత్తు పదార్థాల వాసన రావొద్దని ఇటీవల సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంజాయి, నాటుసారా, గుట్కాలతో యువత చిత్తు అవుతున్నదని, క్షేత్రస్థాయిలో వాటి మూలాలు గుర్తించి క్రయవిక్రయాలకు అడ్డుకట్టవేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీస్, ఎక్సైజ్ అధికారులు గంజాయి సాగు, నాటుసారాను అరికట్టేందుకు రంగంలోకి దిగారు. ఇటీవల ఆమనగల్లు సర్కిల్ పరిధిలో కడ్తాల మండలంలోని బాలాజీనగర్ తండాలో గంజాయి సాగును గుర్తించి పోలీసులు ధ్వంసం చేశారు. ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డతండా గేటు వద్ద గంజాయి ప్యాకెట్లు విక్రయానికి పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఆమనగల్లు బ్లాక్ మండలాలు ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గల మండలంలో పోలీసు, ఎక్సైజ్ అధికారుల నిఘా పెంచి నాటుసారా తయారీ, గంజాయి సాగును అరికట్టారు.
గంజాయి సాగు చేస్తే చర్యలు..
మత్తు పదార్థాల క్రయవిక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ప్రత్యేకంగా ఒక టీమ్ ను ఏర్పాటు చేసి గంజాయి సాగు, క్రయవిక్రయాలపై దృష్టిపెట్టాం. గ్రామాల వారీగా జులాయిగా తిరిగే యువత జాబితా సేకరిస్తున్నాం. యువత మత్తుకు బానిస కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మత్తుకు అడిక్ట్ అయిన వారిని గుర్తించి కౌన్సెలింగ్ చేస్తున్నాం. గంజాయి సాగు, మత్తు పదార్థాల విక్రయాలపై సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇప్పటికే ప్రత్యేక బృందాలు గ్రామాలు, తండాల్లో పర్యటిస్తూ గంజాయి సాగు కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-ఉపేందర్, సీఐ, ఆమనగల్లు,సర్కిల్
పీడీయాక్ట్ నమోదు చేస్తాం…
తండాలు, గ్రామాల్లో నాటు సారా కాయకుండా అడ్డుకట్టవేస్తున్నాం. నాటుసారా కాసి మొదటి సారి పట్టుబడితే తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తున్నాం. రెండో సారి పట్టుబడితే కఠినంగా వ్యహరించి పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నాం. ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు నిరంతరం పర్యటించి ఆకస్మికంగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నాం. దుకాణాల్లో నల్లబెల్లం క్రయవిక్రయాలు జరుగకుండా చర్యలు తీసుకొంటున్నాం.
-వేణుకుమార్,ఎక్సైజ్ సీఐ,ఆమనగల్లు.