పెద్దఅంబర్‌పేట, మే 28 : పగిడీ.. పగిడీ.. పగిడీ.. వివాహ వేడుకల్లో పగిడీలు ధరించడం నేడు ఓ ట్రెండ్‌గా మారుతున్నది. ఒకప్పుడు ధనికుల పెండ్లిళ్లలో కనిపించే పగిడీలు.. ప్రస్తుతం మధ్య తరగతివారి వేడుకల్లో సైతం దర్శనమిస్తున్నాయి. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురుతోపాటు దగ్గరి బంధువులంతా పగిడీ ధరిస్తున్నారు. దీన్ని హుందాతనం, మర్యాదకు ప్రతీకగా భావిస్తున్నారు. కొత్తగా కనిపించాలనే తాపత్రయంతో చాలామంది వీటిని ధరించేందుకు మక్కువ చూపుతున్నారు. వివిధ డిజైన్లలో లభిస్తుండగా.. ఒక్కో పగిడీని కట్టేందుకు రూ.100 నుంచి రూ.250 వరకు తీసుకుంటున్నారు.
పగిడీ.. పగిడీ.. పగిడీ.. ఇప్పుడు పెండ్లి వేడుకల్లో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది.. కనిపిస్తున్నదీ అదే. వివాహ వేడుకల్లో పలుచోట్ల పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు పగిడీ ధరించడం చూస్తుంటాం. కానీ, పెండ్లికి హాజరైన దగ్గరి బంధువులంతా పగిడీ ధరించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. వివాహ వేడుకల్లో కొత్తదనం దర్శనమిస్తున్నది. మధ్య తరగతి నుంచి ఉన్నతస్థాయి వరకు ఏదో కొత్తగా కనిపించాలనే తాపత్రయం కనిపిస్తున్నది. అందుకే పెండ్లిలో వధువు తరఫు దగ్గరి బంధువులు పగిడీలు ధరించేందుకు మక్కువ చూపుతున్నారు. ఇందుకు తగ్గట్టే మార్కెట్లో విభిన్న రంగుల్లో పగిడీకి కావాల్సిన వస్ర్తాలు లభిస్తున్నాయి. కొంతకాలం కిందట వరకు నగరానికే పరిమితమైన ఈ పగిడీ సంస్కృతి ఇప్పుడు నగర శివారుతోపాటు జిల్లావ్యాప్తంగా పాకుతున్నది.
మహిళలకు కూడా..
పెండ్లిల్లో వధువు తరఫు బంధువులు పగిడీలు ధరించేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారు. చాలాచోట్ల పురుషులే పగడీలు పెట్టుకుని కనిపిస్తున్నారు. కొన్ని పెండ్లిళ్లలో మాత్రం మహిళలు కూడా పగిడీలతో దర్శనమిస్తున్నారు. చిన్నారుల సంగతి చెప్పనక్కర్లేదు. వారికి పెండ్లి పెద్దలే దగ్గరుండి మరీ ప్రత్యేకంగా పగిడీలు కట్టిస్తున్నారు. రెండు, మూడేండ్ల కిందటి వరకు కొన్ని మార్వాడీల వివాహ మహోత్సవాల్లోనే ఈ పగిడీలు ధరించడం కనిపించేది. కానీ, ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలు సైతం పగిడీలు ఏర్పాటు చేస్తున్నాయి.
డిజైన్‌ను బట్టి రేటు
డిజైన్‌ను బట్టి పగిడీల ధరలు ఉన్నాయి. ఒక్కో పగిడీ ధర సాధారణంగా రూ.100 నుంచి మొదలై రూ.250 ఆపై కూడా ఉంటున్నాయి. వస్త్రంతో కలిపి ఒక్కొక్కరికి పగిడీ కట్టేందుకు ఓ రేటు నిర్ణయిస్తున్నారు. కొందరు వస్త్రంతో కలిపి ఒకరికి పగిడీ చుట్టేందుకు రూ.120 తీసుకుంటున్నారు. పగిడీ చుట్టే వస్ర్తానికి ఉండే డిజైన్‌కు అనుగుణంగానే.. తీసుకునే రేట్లు ఆధారపడి ఉంటున్నాయి. ‘పగిడీ వస్త్రం డిజైన్‌ను బట్టి దాని ధర ఉంటుంది. పెండ్లిల్లో మేం పగిడీలు పెట్టుకునేవారి సంఖ్యను బట్టి కూడా ధరను నిర్ణయిస్తాం. సాధారణంగా ఎలాంటి డిజైన్లు లేకుండా కేవలం ఎర్ర బట్టతో ఉంటే ఒక్కరికి పగిడీ కట్టేందుకు రూ.120 తీసుకుంటాం.
అదికూడా కనీసంగా పెండ్లిలో 50, అంతకంటే ఎక్కువమంది ధరించాల్సిందేనని ముందే చెప్పేస్తాం. అందుకు అనుగుణంగా క్లాత్ తీసుకొస్తాం. తక్కువమందికి పగిడీ కట్టేందుకు వస్తే మాక్కూడా వర్కవుట్ కాదు. రెండు, మూడేండ్ల కిందట పగిడీలకు ఇంత గిరాకీ లేదు. ఒకప్పుడు ఆర్థికంగా ఉన్నవారే పగిడీలు పెట్టించేవారు. కానీ, ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా పెట్టిస్తున్నారు. ప్రతి పది పెండ్లిళ్లలో ఐదింట పగిడీలు పెట్టించేందుకు ఆసక్తి చూపుతున్నారు’ అని వివాహాల్లో పగిడీలు పెట్టే చార్మినార్‌కు చెందిన హుస్సేన్ చెబుతున్నాడు. ఏదైనా పెండ్లిలో పగిడీలు కట్టే గిరాకీ వస్తే.. ఇద్దరం కలిసి వస్తామని పేర్కొన్నాడు. పగిడీలు కట్టేందుకు మెజార్టీగా ఓల్డ్ సిటీ నుంచే వస్తుంటారని చెప్పాడు.
మర్యాదగా భావిస్తున్న పెండ్లి పెద్దలు..
పెండ్లికి హాజరైన దగ్గరి బంధువులకు దగ్గరుండి పగిడీలు పెట్టించడాన్ని కొందరు పెండ్లి పెద్దలు మర్యాదగా భావిస్తున్నారు. ఫంక్షన్ హాళ్లలో పగిడీలు పెట్టించేందుకు ఓ చోట ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయిస్తున్నారు. ముందుగా పెండ్లికొచ్చిన పిల్లలందరికీ పగిడీలు చుట్టిస్తున్నారు. ఇక వివాహ వేడుకల్లోని యువత సైతం పగిడీలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నది. మంచి మంచి డిజైన్లు ఉన్న పగిడీలను పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నది. పెండ్లి వేడుకల్లో అత్యంత ముఖ్యమైన ఫొటోగ్రఫీలోనూ పగిడీలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.