నవాబుపేట, మే 26 : ఎనిమిదో విడుత హరితహారానికి గ్రామాల నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మండలంలోని 32 పంచాయతీల్లో సర్పంచ్, సెక్రటరీలు కూలీలతో మొక్కల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మండల ప్రజాపరిషత్ అధికారి సుమిత్రమ్మ పంచాయతీ సెక్రటరీలకు ప్రతి వారం సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎంపీడీవో, ఎంపీవోలు మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. 2022-2023 సంవత్సరానికి ఆయా గ్రామాల నర్సరీల్లో 5లక్షల, వెయ్యి మొక్కలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేశారా.. లేదా అని పరిశీలిస్తున్నారు. వచ్చే హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు స్థలాలను పరిశీలిస్తున్నారు. రోడ్ల వెంట మరో వరుస నాటడంతో పాటు ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేయనున్నారు. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉన్నా మొక్కలు నాటాలని ఇప్పటికే సిబ్బంది, పంచాయతీ పాలక వర్గాలకు అవగాహన సైతం కల్పించారు.
గతేడాదికంటే అధికంగా మొక్కలు నాటుతాం..
ఇప్పటికే ఏడు విడుతల్లో నాటిన మొక్కలతో పల్లెలు పచ్చబడ్డాయి. ఈసారి హరితహారం కార్యక్రమంలో గతేడాది కంటే అధికంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నాం. నాటిన ప్రతి మొక్కకు సంరక్షణ చర్యలు తీసుకుంటాం. నర్సరీల్లో ఏమైనా మెటిరీయల్ అవసరమొస్తే సర్పంచ్లు సహకరించాలి.
– లక్ష్మీదేవి, ఏపీవో