మహేశ్వరం, నవంబర్ 14: గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను పటిష్టపరిచేందుకు నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చింది. గ్రామ స్వరాజ్యాన్ని బలపరుస్తుంది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను మంజూరు చేస్తున్నది. సిరిగిరిపురం గ్రామానికి గ్రామ స్వరాజ్ అభియాన్ కింద రూ.20లక్షలు, పంచాయతీ నిధులు రూ.2లక్షలతో మొత్తం రూ. 22లక్షలతో పంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని, తుది దశకు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి హరిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్త పంచాయతీ భవనం నిర్మాణమవుతుండటంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మౌలిక వసతులు కల్పిస్తున్నాం
ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ పంచాయతీలకు సొంతంగా భవనాలు ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సిరిగిరిపురం గ్రామానికి నూతన పంచాయతీ భవనం గ్రామ స్వరాజ్ అభియాన్ కింద ప్రభుత్వం సహకారంతో రూ.20లక్షలు, గ్రామపంచాయతీ నిధులు రూ.2 లక్షలు.. మొత్తం రూ.22లక్షలతో పనులు జరుగుతున్నాయి. దాదాపుగా నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. గ్రామ పంచాయతీలకు కావాల్సిన నిధులను అందించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
మంత్రికి కృతజ్ఞతలు
సిరిగిరిపురం గ్రామంలో పురాతన పంచాయతీ భవనం ఉన్నందున ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. .22 లక్షలతో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నూతన పంచాయతీ భవనానికి సహకరించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు.