ఇబ్రహీంపట్నంరూరల్, మే 23 : సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించి రసాయన ఎరువులపై దృష్టి సారించడంతో మానవాళితో పాటు మూగజీవాలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రైతుల వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలను పాటిస్తూ రసాయన ఎరువులను పూర్తిగా మరిచి సేంద్రియ ఎరువులపై దృష్టి కేంద్రీకరించాలి. దీంతో అధిక దిగుబడులతో పాటు మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. క్రిమిసంహారక మందులను ఇష్టానుసారంగా పంటలపై పిచికారీ చేస్తున్నారు. రసాయన ఎరువులు, క్రిమిసంహార మందులను పరిమితి మించి వాడితే భూసారం తగ్గిపోతుంది. దీంతో పంటల సాగుకు భూమి పనికిరాకుండా పోతుంది. ఈ విషయాలపై తరచుగా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రసాయ ఎరువుల వాడకంతో రసాయనాల అవశేషాలు ధాన్యపు గింజల్లో దాగి ఉంటాయి. వాటిని తినడంతో కిడ్నీ, జీర్ణవ్యవస్థలపై ప్రభావం పడుతుంది. అలాగే విషపూరితమైన గడ్డిని మేయడం ద్వారా మూగజీవాలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నాయి. పంట కోసిన వెంటనే దుక్కి దున్ని సేంద్రియ ఎరువులను వేసి తిరిగి దున్నించడం ద్వారా మంచి దిగుబడి వచ్చే అవకాశముంది. రసాయన ఎరువుల స్థానంలో వర్మీ కంపోస్టు, ఆవుపేడ, కోడి ఎరువుతో పాటు ఇతర కషాయాలను వినియోగించాలని వ్యవసాయశాఖ నిపుణులు సూచిస్తున్నారు.
సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలి:సత్యనారాయణ, వ్యవసాయశాఖ ఏడీఏ, ఇబ్రహీంపట్నం
మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగుల మందులను వాడకూడదు. రసాయనిక ఎరువుల వినియోగంతో మానవాళి ఆరోగ్యంతోపాటు భూసారం దెబ్బతింటుంది. తెగుళ్లు మరింత ఎక్కువవుతాయి. పచ్చిరొట్టతో పాటు ఇతర సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలి. రైతులు తప్పనిసరిగా వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. భూసార పరీక్షలు చేయించుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు.