రంగారెడ్డి, మే 10, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో దళిత బంధు పథకం అమలు వేగంగా జరుగుతున్నది. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి ఇప్పటికే ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు. ఇప్పటికే 80 మంది లబ్ధిదారులకు సంబంధించి మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమక్షంలో యూనిట్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఎంచుకున్న వ్యాపారాల్లో ఏ విధంగానైనా నష్టపోయినట్లయితే వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకుగాను ఏర్పాటు చేసిన రక్షణ నిధి కింద ఇప్పటివరకు రూ.48.30 లక్షల నిధులను సంబంధిత అధికారులు జమ చేశారు. మరోవైపు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 698 మంది లబ్ధిదారులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. జిల్లాలో షాద్‌నగర్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు, మహేశ్వరంలో 100, చేవెళ్లలో 82, ఇబ్రహీంపట్నంలో 100, ఎల్బీనగర్లో 81, కల్వకుర్తిలో 63, రాజేంద్రనగర్‌లో 100, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 72 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
483 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ
దళిత బంధు పథకంలో భాగంగా జిల్లాకు ఇప్పటివరకు రూ.48.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. సంబంధిత నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున సంబంధిత అధికారులు జమ చేశారు. జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో 698 మంది లబ్ధిదారులకుగాను 483 మంది లబ్ధిదారులకు సంబంధించి డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే 80 మందికి సంబంధించి యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయగా, మిగతా 403 మంది లబ్ధిదారులకు వారం రోజుల్లో యూనిట్లను గ్రౌండింగ్ చేయనున్నారు.
గ్రౌండింగ్ ప్రక్రియను ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లోనే చేపట్టి లబ్ధిదారులకు స్థానికంగానే యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల చొప్పున జమ అయిన లబ్ధిదారులకు సంబంధించి చేవెళ్ల నియోజకవర్గంలో 57 మంది లబ్ధిదారులకు, ఇబ్రహీంపట్నంలో 58, కల్వకుర్తిలో 55, ఎల్బీనగర్లో 31, మహేశ్వరంలో 77, రాజేంద్రనగర్‌లో 92, షాద్‌నగర్‌లో 70, శేరిలింగంపల్లిలో 43 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున కలెక్టర్ బ్యాంకు ఖాతా నుంచి జమ చేశారు. దళిత బంధు కార్యక్రమం కింద అధికంగా మినీ డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 70 మంది లబ్ధిదారులు మినీ డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. షెడ్ల నిర్మాణం పూర్తైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే రూ.10 లక్షల నిధులను జమ చేశారు.
వారం రోజుల్లో నియోజకవర్గ కేంద్రాల్లో యూనిట్ల పంపిణీ ;ప్రవీణ్‌రెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దళిత బంధు పథకంలో భాగంగా ఇప్పటికే 80 మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశాం. మరో 403 మంది లబ్ధిదారులకు వచ్చే వారంలో నియోజకవర్గ కేంద్రాల్లోనే యూనిట్లను పంపిణీ చేస్తాం. జిల్లాకు ఇప్పటివరకు రూ.48 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెలాఖరులోగా జిల్లాలో ఎంపికైన లబ్ధిదారులందరికీ యూనిట్లను గ్రౌండింగ్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తాం.