షాద్‌నగర్, మే 10: తెలంగాణ సర్కార్ ప్రోత్సాహంతో మత్స్యకారుల పంట పండింది. గత ఏడాది ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలు పెద్దవై విక్రయాలు జోరందుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 837 చెరువుల్లో 1.70 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా, ప్రస్తుతం సుమారు 5 వేల టన్నుల చేపల ఉత్పత్తి కావచ్చని మత్స్య శాఖ అధికారులు అంచనా వేశారు. వికారాబాద్ జిల్లాలో 700 చెరువుల్లో గడిచిన ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ నెలల్లో కోటీ 13లక్షల పైచిలుకు చేప పిల్లలు, 3.45లక్షల రొయ్య పిల్లలను చెరువుల్లో వదిలారు. ఈసారి చేపల ఉత్పత్తి అధికంగా రావడంతో చెరువులు, ప్రాజెక్టుల వద్ద విక్రయాల సందడి నెలకొన్నది. వికారాబాద్ జిల్లాలో సుమారు రూ.20 కోట్ల ఆదాయం సమకూరనున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మత్స్యకారులు, ముదిరాజ్ కుటుంబాలకు ఈ ఏడాది అధికంగా ఆదాయం సమకూరనుండడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాడు బీటలు వారిన చెరువులు.. చీమల పుట్టలతో చెరువుల కట్టలు.. ముండ్ల పొదలతో నిండిన చెరువులు తప్పా, నీళ్లు ఉన్న చెరువులు కనిపించేవి కావు. పైగా చెరువులు, కుంటల్లో చేపలు ఉన్నాయనే మాటే వినని రోజులవి. కానీ తెలంగాణ సర్కారు వచ్చాక పల్లెల్లో సంపదను సృష్టించాలనే ఆలోచనతో మిషన్ కాకతీయకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫలితంగా నేడు చేపల విక్రయాల సందడి పెరిగింది.
గత వానకాలంలో 1.70 కోట్ల చేప పిల్లల పంపిణీ..
రంగారెడ్డి జిల్లాలోని 837 చెరువుల్లో 1.70 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జిల్లాలో నీళ్లున్న చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలారు. బొచ్చ, రవ్వ, బంగారు తీగ వంటి రకాల చేపలను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. నల్గొండ జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కైకలూరు నుంచి చేప పిల్లలను దిగుమతి చేసుకొని మత్స్య సహకార సంఘాలు, ముదిరాజ్ సంఘాల ద్వారా చెరువుల్లో చేపలను వదిలారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, జల్పల్లి, పాలమాకుల, ఆమనగల్లు, షాబాద్, తారామతి పేట, పెద్ద అంబర్‌పేట, అనాజీపూర్, రావిర్యాల వంటి పెద్ద చెరువుల్లో చేపల ఉత్పత్తి బాగా పెరిగింది. ఫరూఖ్‌నగర్, కొత్తూరు, షాబాద్, కేశంపేట, యాచారం, చేవెళ్ల, మహేశ్వరం, మాడ్గుల, రాజేంద్రనగర్, శంకర్పల్లి వంటి మండలాల పరిధిలోని చెరువుల్లో ఈ ఎండాకాలంలో చేపలను పట్టి విక్రయిస్తున్నారు. మృగశిర కార్తె నాటికి చేపలు పూర్తిస్థాయిలో పెరిగి విక్రయించేందుకు అవకాశం ఉంటుందని మత్స్య కార్మికులు పేర్కొంటున్నారు.
5 వేల టన్నుల ఉత్పత్తి..
గడిచిన ఏడాదితో పోల్చితే ఈసారి చేపల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నదని మత్స్యశాఖ అధికారులు భావిస్తున్నారు. గత వర్షాకాలంలో 1.70 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు వాటి సస్యరక్షణపై మత్స్య కార్మికులు, సహకార సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సీజన్లో జిల్లాలో సుమారుగా 5 వేల టన్నుల చేపల ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది.
5,920 మత్స్యకారులకు లబ్ధి
రంగారెడ్డి జిల్లాలోని వేల కుటుంబాలు మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన 110 మత్స్య కారుల సొసైటీలు ఉండగా, ఇందులో 5,920 మంది మత్స్య కార్మికులు సభ్యులుగా ఉన్నారు. మరో 2 వేల మంది వరకు గుర్తింపు లేని కార్మికులు మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. రెండు ఎకరాల విస్తీ ర్ణం చెరువు ఒక్కరి చొప్పున మత్స్య కార్మికులను ప్రభుత్వం గుర్తిస్తూ కనీసం 20 మంది సభ్యుల నుంచి 200 మంది సభ్యులతో కూడిన సొసైటీలను ఏర్పాటు చేసింది. ఫరూఖ్‌నగర్, కేశంపేట, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాలతోపాటు జీహెచ్ఎంసీకి ఆనుకొని ఉన్న ప్రాంతాల మత్స్య కార్మికులు కూడా చేపల విక్రయాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
కలిసొచ్చిన సర్కారు ప్రోత్సాహం..
చేపల సాగును ప్రోత్సహించేందుకు అవసరమయ్యే మౌలిక వసతులతోపాటు రాయితీని ప్రభుత్వం అందిస్తున్నది. 75 శాతం రాయితీతో పాటు టీవీఎస్ మోటర్ వాహనాలు, చేపల వలలు, తెప్పలు, డీసీఎం వాహనాలను సమకూర్చుతున్నది. అన్ని ప్రాంతాల్లోనూ పూర్తి ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నది. ఒక్కో కార్మికుడికి రూ.6 లక్షల బీమాను కల్పిస్తున్నారు. చేప పచ్చళ్లను తయారు చేసేందుకు మహిళా సంఘాలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. చేపల ప్యాకింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆర్థిక సాయాన్ని పొందొచ్చు. రీ సైకిలింగ్ ఆక్వా సిస్టమ్ ద్వారా చేపలను పెంచేందుకు ఎస్సీ, ఎస్టీ మహిళలకు 60 శాతం, సాధారణ వర్గాల మహిళలకు 50 శాతం రాయితీతో ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో చేపల విక్రయాలను చేసేందుకు రూ.10 లక్షల విలువ చేసే వాహనాలను 60 శాతం రాయితీతో వ్యాపారులకు అందిస్తున్నారు. ఇలా మత్స్య కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చిస్తున్నది.
మా ఊరి చెరువులో ఆరు కిలోల చేపలు
సర్కారు పంపిణీ చేసిన చేప పిల్లలను మా ఊరి చెరువులో పెంచాం. ఇప్పుడు ఒక్కో చేప 3 నుంచి 6 కిలోల వరకు పెరిగింది. ఇంత ఎండాకాలంలోనూ చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. పట్టిన చేపలను చెరువు కట్టపైనే విక్రయిస్తున్నాం.
– కావలి కృష్ణ, మత్స్య సహకార సంఘం సభ్యుడు, మేకగూడ, నందిగామ మండలం