బొంరాస్‌పేట, మే 10: మండు వేసవిలో, కరువు కాలంలో కాలే కడుపునకు కాసింత అంబలి తాగితే దాహంతోపాటు ఆకలి తీరుతుంది. బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం గ్రామానికి సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం గ్రామస్తులు, దారిన వెళ్లే వారి దాహాన్ని తీరుస్తున్నది. బసవన్న దేవాలయం దగ్గర గ్రామానికి చెందిన తారాపురం నీలప్ప, సిద్ధిలింగప్ప, ఈరప్ప, బస్వరాజు కుటుంబాల వారు ప్రతి ఏడాది అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పాదచారుల దాహాన్ని తీర్చుతున్నారు. ఐదు వారాలపాటు ఇలా అంబలిని పంపిణీ చేస్తారు.
ముందురోజు రాత్రి ఇంటి దగ్గర తెల్ల జొన్నలను నానబెట్టి ఉదయం ఆలయం దగ్గరకు వచ్చి నాలుగు మట్టి కుం డల్లో అంబలిని కాస్తారు. తరువాత బసవన్నకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి దారిన రాకపోకలు సాగించే వారికి, గ్రామస్తులు, రైతులకు పోస్తారు. ఏటా అంబలి కేంద్రా న్ని ఐదు వారాలపాటు కొనసాగిస్తారు. బుధవారం వచ్చిందంటే చాలు రేగడిమైలారం గ్రామానికి చెందిన చాలామంది పాత్రలతో వచ్చి అంబలిని తీసుకెళ్తుంటారు. పొలాలకు వెళ్లేవారు టిఫిన్ బాక్సులు, ముంతల్లో అంబలిని తీసుకెళ్తారు. దారిన పోయేవారు అంబలిని తాగి సేద తీరుతారు. రెండు గ్లాసుల అంబలి తాగినా ఎండాకాలంలో ఎంతో హాయిగా, చల్లగా ఉంటుంది.
ఇదీ నేపథ్యం..
గ్రామానికి చెందిన తారాపురం కుటుంబీకులు సుమా రు వంద ఏండ్లకుపైగా అంబ లి కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. పూర్వకాలంలో వాహన సౌకర్యం లేనప్పుడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతోపాటు రేగడిమైలారం గ్రామానికి చెందిన ప్రజలు కొడంగల్‌లో బుధవారం జరిగే అంగడికి కాలినడకన వెళ్లేవారు. అలా అంగడికి వెళ్లే వారికి, పొలానికి వెళ్లే రైతులకు దాహం వేస్తే అంబలి ద్వారా తీర్చాలని ఈ కుటుంబానికి చెందిన వారు అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
తమ పొలాల్లో పండే తెల్లజొన్నల ద్వారా అంబలి కాసి పోయడం ప్రారంభించారు. అలా ప్రారంభమైన అనవాయితీ నేటికీ కొనసాగుతున్నది. తారాపురం కుటుంబాలకు చెందిన రేగడి పొలాల్లో నేడు తెల్ల జొన్నలు పండించకున్నా జొన్నలను కొని అంబలిని పంపిణీ చేస్తున్నారు. ప్రతి బుధవారం అంబలి తయారు చేసేందుకు 15 కిలోల జొన్నలు అవసరమవుతాయి. అంద రు కలిసి ఈ ఖర్చును భరిస్తారు. తారాపురం కుటుంబీకులు ధనవంతులు కారు. ఏటా శ్రీరామ నవమి తరువాత అంబలి కేంద్రాన్ని ప్రారంభించి ఐదు వారాలపాటు కొనసాగిస్తుంటారు. బసవ జయంతి రోజు తారాపురం కుటుంబీకులు బసవన్న ఆలయం దగ్గర అన్నదానం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు.
బొంరాస్‌పేటలో..
మండల కేంద్రంలోని నైబర్‌హుడ్ కేంద్ర ఆవరణలోనూ కొన్నేండ్ల నుంచి పొట్ట రామయ్య, పొట్ట నర్సయ్య ఆధ్వర్యంలో అంబలి కేంద్రా న్ని నిర్వహిస్తున్నారు. ఉగాది పండుగ తరువాత నుంచి ప్రారంభించి వర్షాకాలం ప్రారంభం వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు అంబలి కాసి పోస్తారు. ఇక్కడ రాగి అంబలి ప్రత్యేకం. రాగుల పిండితో అంబలి తయారు చేసి ప్రజలకు పంపిణీ చేస్తారు. అంబలిని తీసుకెళ్లేందుకు నిత్యం ప్రజలు పాత్రలు తీసుకుని బారులు తీరుతారు. కరోనా కారణంగా రెండుచోట్ల రెండేండ్ల విరామం ప్రకటించినా కరోనా తగ్గడంతో అంబలి కేంద్రాలను మళ్లీ ప్రారంభించారు.
ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం
మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం ఇది. మంచి లక్ష్యంతో ప్రారంభించిన అంబలి పంపిణీని నేటికీ ఆపకుండా కొనసాగిస్తున్నాం. ఎండాకాలంలో ప్రజలకు కొంత దప్పిక తీర్చామన్న సంతృప్తి ఉంటుంది.
–తారాపురం సిద్ధమ్మ, అంబలి కేంద్రం నిర్వాహకురాలు
బాటసారుల దాహాన్ని తీర్చుతున్నది
నా చిన్నప్పటి నుంచి అంబలిని పంపిణీ చేస్తున్నారు. ఎండాకాలంలో పొలం పనులు చేసేవారికి, దారిన వెళ్లే బాటసారులకు అం బలి కేంద్రం ఎంతో ఉపయోగడుతున్నది. మండు వేసవిలోనూ గ్రామస్తుల దాహం తీర్చుతున్నది. తారాపురం కుటుంబాల ఔదార్యం అభినందనీయం. -జగదీశ్, ఎంపీటీసీ, రేగడిమైలారం
ఆకలిని తగ్గిస్తుంది..
అంబలి ఆకలిని తగ్గిస్తుంది. రాగులతో తయారు చేసిన అంబలిలో క్యాల్షియం, మినరల్స్ ఎక్కువగా ఉండటంతో కొవ్వు ను తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధ్దకాన్ని నివారిస్తుంది, త్వరగా జీర్ణమవుతుంది. గోధుమలు, జొన్నలతో తయారు చేసిన అంబలిలో ప్రొటీన్లు, విటమిన్లు ఉంటాయి.
– రవీంద్రయాదవ్, వైద్యులు