షాద్‌నగర్/కేశంపేట మే 10 : దళితుల జీవితాల్లో వెలుగు నింపే దళితబంధు పథకం రంగారెడ్డి జిల్లాలో వేగంగా అమలవుతున్నది. జిల్లావ్యాప్తంగా తొలి విడుతలో 698 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా, ప్రభుత్వం ముందుగా 483 మందికి రూ.48.30 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇందులో రక్షణ నిధి కింద ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.10 వేల చొప్పున రూ.48.30 లక్షలను సేకరించింది. అంతేకాకుండా ఎంపికైనవారిలో 80 మంది లబ్ధిదారుల యూనిట్ల గ్రౌండింగ్ పనులు పూర్తి కాగా, మంత్రి సబితారెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మిగతా 403 మంది లబ్ధిదారులకు సంబంధించి వారం రోజుల్లో యూనిట్ల గ్రౌండింగ్ పనులను పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే అధిక శాతం మంది మినీ డెయిరీలను ఎంపిక చేసుకుని తమ షెడ్లను సైతం నిర్మించుకున్నారు. త్వరలో తాము ఎంచుకున్న యూనిట్లను నెలకొల్పుకోనుండడంతో దళితుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
రోగులకు తెల్ల గోలీలు, సూది మందులు.. పరిస్థితి అంతకు మించితే ప్రైవేట్ దవాఖానలకు లేదా ఉస్మానియా దవాఖానకు పరుగులు.. ఇదంతా షాద్‌నగర్ కమ్యూనిటీ దవాఖాన ఒకప్పటి కథ. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత వైద్య సేవల్లో చాలా మార్పులొచ్చాయి. షాద్నగర్వాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వంద పడకల దవాఖాన అత్యాధునిక వసతులతో నిర్మాణం కాబోతున్నది. దీంతో విలువైన వైద్య పరీక్షలు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. షాద్నగర్వాసులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు షాద్‌నగర్ పట్టణంలో వంద పడకల దవాఖాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లావాసులకు అత్యాధునిక వసతులతో టిమ్స్ దవాఖాన అందుబాటులోకి రావడమే కాకుండా.. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సర్కారు దవాఖానల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తున్నది.
రూ. 20.89 కోట్లతో..
షాద్‌నగర్ నియోజకవర్గంతోపాటు పరిగి, జడ్చర్ల, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాలకు చెందిన ప్రజలు తమ వైద్య సేవల కోసం షాద్‌నగర్ కమ్యూనిటీ దవాఖానకు వస్తుంటారు. దీనికి తోడు నియోజకవర్గంలో సుమారు 25 కిలోమీటర్ల మేర 44వ జాతీయ రహదారి, ఆమనగల్లు, పరిగి, ముంబై వంటి ప్రాం తాలకు వెళ్లే ప్రధాన రహదారులు ఉండటంతో ఏమైనా ప్రమాదాలు జరిగితే గాయపడినవారు మొదటగా ఈ దవాఖాననే ఆశ్రయిస్తుంటారు. ఇలా ప్రతిరోజూ రోగులు, సామాన్య ప్రజలతో షాద్‌నగర్ సర్కారు దవాఖాన కిటకిటలాడుతుంటుంది. గత దశాబ్ద కాలంగా ఈ దవాఖానను వంద పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేయాలని స్థానికులు, నాయకులు అప్పటి ఉమ్మడి ప్రభుత్వాల పాలకులను వేడుకున్నా ఫలితంలేదు.
కాగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే సదుద్దేశంతో షాద్‌నగర్‌లోని ప్రస్తుత 50 పడకల కమ్యూనిటీ దవాఖానను వంద పడకల దవాఖానగా విస్తరించేందుకు చర్యలు తీసుకున్నది. ఇందుకోసం రూ. 20.89 కోట్ల నిధులను కూడా వైద్య విధాన పరిషత్ ద్వారా విడుదల చేసింది. రూ.17 కోట్లతో షాద్‌నగర్ శివారులోని అలీసాబ్గూడ రెవెన్యూ పరిధిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా దవాఖానను నిర్మించనున్నారు.
ఇందులో ఆపరేషన్ థియేటర్లు, ప్రతి పడక వద్ద ఆక్సిజన్ సరఫరా, పల్స్ మిష న్లు, వైద్య పరీక్షల కేంద్రాలు, విశ్రాంతి గదులు, అల్పహారం తినేందుకు వసతుల గదులు, రోగుల బంధువులు సేదతీరేందుకు ప్రత్యేక గదులు, వాహనాల పార్కింగ్, అంబులెన్స్‌ల పార్కింగ్, రక్తపు నిల్వ గదులను నిర్మించనున్నారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ఇందులో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. చిన్నపిల్లల వైద్య నిపుణులు, చర్మ రోగ వైద్య నిపుణులు, ఆపరేషన్ల వైద్యులు, స్త్రీ రోగాల వైద్య నిపుణులు, సాధారణ వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక వైద్యు లు, సహాయక సిబ్బంది, నర్సులు అందుబాటులో ఉండనున్నారు. ఖరీదైన వైద్య సేవలూ ఉచితంగా అందనున్నాయి.
ప్రతి ఏటా రూ.2.39 కోట్ల నిధులు
షాద్‌నగర్ పట్టణంలో వంద పడకల దవాఖాన అందుబాటులోకి వచ్చిన అనంతరం వైద్య సేవలను విస్తృతంగా అందించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 2.39 కోట్ల నిధులను అదనంగా ఖర్చుచేయనున్నది. రూ.2.07 కోట్లతో వైద్య నిపుణులు, ఇతర సిబ్బందికి వేతనాలను చెల్లించనున్నది. అదేవిధంగా రోగులకు అందించే ఆహారం, మందులు, ఇతర వైద్య సేవలకు అవసరమయ్యే వస్తువులకు కూడా ప్రభుత్వం భారీ గా నిధులను కేటాయించనున్నది. సాధారణ రోగాలతోపాటు ఆపరేషన్లు, అత్యవసర సేవలు, రోడ్డు ప్రమాదాల వైద్యసేవ లు, ఖరీదైన ఇతర వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందనున్నా యి. ట్రామా కేర్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ స్పష్టం చేశారు.
కొత్తూరు మండలానికి మంత్రి హరీశ్‌రావు రాక
కొత్తూరు రూరల్, మే 10: కొత్తూరు మండలానికి బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు రానున్నట్లు టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి హరీశ్‌రావు షాద్‌నగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో ఉన్న దర్గాకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. మంత్రి పర్యటనను విజయవం తంచేయాలని ఆయన టీఆర్ఎస్ నాయకులకు సూచించారు.
కేశంపేటలోనూ 30 పడకల దవాఖాన
దశాబ్దాల చరిత్ర కలిగిన కేశంపేట మండల కేంద్రంలోని సర్కారు దవాఖానను మరింత బలోపేతం చేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు పడకల దవాఖానను 30 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేసేందు కు ప్రభుత్వం రూ. 75 లక్షల నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందితోపాటు స్త్రీ వ్యాధుల నిపుణు లు, సాధారణ, ఇతర వైద్యుల సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెరుగైన వైద్య పరీక్షలు, ఇతర సాధారణ, అత్యవసర సేవలు అందనున్నాయి. ఈ దవాఖానను కూడా బుధవారం మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి ప్రారంభించనున్నారు. అదేవిధంగా కేశంపేట మండలంలోని ఎక్లాస్‌ఖాన్‌పేటలో ఏర్పాటు చేసిన నూతన సబ్‌స్టేషన్ ను మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అం జయ్యయాదవ్ ప్రారంభించనున్నారు. అనంతరం అల్వాల, కొత్తపేట, ఇప్పలపల్లి గ్రామాల్లోని రైతు వేదిక భవనాలను కూడా వారు ప్రారంభించనున్నారు.
ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుంది
అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. షాద్‌నగర్ పట్టణంలో వంద పడకల దవాఖాన నిర్మాణం కానుండటం సంతోషకరం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఆ దవాఖాన నిర్మాణానికి రూ.20.89 కోట్ల నిధులు మంజూరయ్యా యి. గతంలోని ఉమ్మడి రాష్ట్ర పాలకులు వంద పడకల దవాఖాన ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దవాఖాన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం గర్వించదగ్గ విషయం. అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనున్నది.
–అంజయ్యయాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే
పెరుగనున్న సిబ్బంది సంఖ్య
వంద పడకల దవాఖాన ఏర్పాటుతో ప్రజలు, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. వైద్యులు, వైద్య నిపుణులు, నర్సులు, ఇతర సిబ్బంది సంఖ్య పెరుగనున్నది. ఈ ప్రాంతంలో 100 పడకల దవాఖాన ఏర్పాటు అత్యంత అవసరం. ఇక్కడికి షాద్‌నగర్ నియోజకవర్గంతోపాటు పరిగి, జడ్చర్ల, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాలకు చెందిన ప్రజలు అధికంగా వస్తుంటారు.
–డాక్టర్ పద్మలత, సూపరింటెండెంట్, షాద్‌నగర్ కమ్యూనిటీ దవాఖాన