బొంరాస్‌పేట, మే 9 : అండగా ఉండాల్సిన నాన్న నాలుగేండ్ల క్రితం పక్షవాతంతో మంచానపడితే అన్నీ తానై పోషించింది అమ్మ. కూలీనాలి చేసి కూతురు, కొడుకును చదివించింది. 20రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్ దవాఖానలో చేరిన తల్లి ఆదివారం రాత్రి కన్నుమూసింది. దీంతో ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తల్లి దూరమైందన్న వ్యథ, మంచానికే పరిమితమై ఏమీ చేయలేని స్థితిలో ఉన్న తండ్రిని చూసి బాధ, భవిష్యత్తు ఏమిటో అర్థంకాని భయం..వెరసి ఆ ఇద్దరి రోదన చూసేవారినీ కన్నీరుపెట్టిస్తున్నది.
బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం గ్రామానికి చెందిన కడంపల్లి అనంతయ్య, అనంతమ్మ(32) భార్యా భర్తలు. వీరికి వెన్నెల, వంశీ ఇద్దరు సంతానం. అనంతయ్యకు నాలుగేండ్ల కిందట పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. తల్లి అనంతమ్మ కూలీపని చేస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నది. ఇంతలోనే అనంతమ్మ కూడా అనారోగ్యానికి గురైంది. 20 రోజుల కిందట హైదరాబాద్‌లోని దవాఖానలో చేరగా క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. దవాఖానలో చికిత్స పొందుతూ అనంతమ్మ ఆదివారం రాత్రి మృతిచెందింది. ఓవైపు తండ్రి అనారోగ్యంతో మంచం పట్టడం, తల్లి మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వెన్నెల కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుండగా, వంశీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. అనంతయ్య తండ్రి హన్మప్ప కూడా ఐదేండ్ల కిందట పక్షవాతంతోనే మృతిచెందాడు. ఉండీ లేనివాడితో సమానమైన తండ్రి, ఉన్నట్టుండి మాయమైన తల్లి, ఎక్కడ ఉండాలో తెలియని అయోమయం, ఏమి చేయాలో తెలియని దైన్యంతో ఆ ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.