ఇబ్రహీంపట్నం, మే 9: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీ పటేల్‌గూడ గ్రామ రోడ్డు వెడల్పు పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బొంగుళూరు గేటు నుంచి పటేల్ గూడ మీదుగా మంగళ్‌పల్లి వరకు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి రెండు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. బొంగుళూరు ఎక్స్‌రోడ్, పటేల్‌గూడ, మంగళ్‌పల్లి గ్రామాల్లో కొత్త కాలనీలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడంతో పాటు పలు ఇంజినీరింగ్ కాలేజీలు వెలిశాయి. దీంతో ఈ రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇటీవల మంత్రి కేటీఆర్.. నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఆదిబట్ల మున్సిపాలిటీ రోడ్ల వెడల్పు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మున్సిపల్ సాధారణ బడ్జెట్ నుంచి ఈ రోడ్డు వెడల్పు పనులకు రూ.1.5 కోట్లు కేటాయించారు. దీంతో ఇరుకుగా ఉన్న ఈ రోడ్డు.. డబుల్ రోడ్డుగా మార్చే పనులు చకచకా జరుగుతున్నాయి. రోడ్డు వెడల్పు పనులు పూర్తయితే పోచారం, ఎలిమినేడు, కప్పాడు తదితర గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ఆదిబట్ల నుంచి కొంగరకలాన్ వెళ్లే రోడ్డు బ్రిడ్జి ఇటీవల వర్షాలకు పూర్తిగా తెగిపోయింది. బ్రిడ్జి నిర్మాణంతోపాటు రోడ్డు మరమ్మతులకు రూ.2.5 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దీంతో మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రోడ్లు త్వరితగతిన మరమ్మతులకు నోచుకోనున్నాయి.
రోడ్డు వెడల్పుతో మారనున్న రూపురేఖలు
బొంగుళూరు గేట్ నుంచి పటేల్‌గూడ, మంగళ్‌పల్లి గ్రామాలకు రోడ్డు వెడల్పు పూర్తయితే ఈ రెండు గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. రెండు గ్రామాల పరిధిలో కొత్త కాలనీలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడంతో ఈ గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. రెండు గ్రామాలకు డబుల్ ఏర్పాటవుతుండటం చాలా సంతోషంగా ఉన్నది.
– మర్రి అర్చన, కౌన్సిలర్