కులకచర్ల, మే 9 : వేసవి కాలంలో తాళ్లఅంతారంలో కల్లు గిరాకీ జోరుగా ఉంటుంది. కులకచర్ల మండల పరిధిలోని మండల పరిధిలోని కులకచర్ల, అంతారం, తిర్మలాపూర్, ఇప్పాయిపల్లి, రాంపూర్, పుట్టపహాడ్ గ్రామాలతోపాటు తండాల్లో తాటి చెట్లు అధికంగా దర్శనమిస్తాయి. అక్కడి ప్రజలకు తాటిచెట్లపైనే జీవనాధారం. ప్రతి ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో కల్లుతోపాటు తాటిముంజలతో జీవనం గడుపుతున్నారు. వేసవిలో చల్లదనంతోపాటు ఆరోగ్యానికి మంచి ఔషధంగా కల్లు, ముంజలు పని చేస్తాయని పలువురు పేర్కొంటున్నారు. అంతారం గ్రామంలో ఎక్కడా చూసినా తాటిచెట్ల కింద కల్లు ప్రియులు దర్శనమిస్తారు. చుట్టు పక్కల ప్రాంతాల వారు తాటికల్లుకు కేరాఫ్‌గా తాళ్లఅంతారం అని పిలుస్తారు. మండల కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న తాళ్లఅంతారం గ్రామానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఫిబ్రవరి మాసంలో తాటికల్లు అధికంగా గీస్తారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో తాటిముంజలకు భలే గిరాకీ ఉంటుంది. తాటిముంజలను సేకరించి నగరానికి, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో ముంజలను తీసుకువెళ్లి మార్కెట్లో విక్రయిస్తుంటారు. తాటిచెట్టు ఎక్కాలంటే మచ్చుకు కొందరే ఉంటారు. తాటిముంజలను తీయాలంటే వారికి కూలీ ఇస్తారు. కొంత మంది చిన్నపాటి గుడిసెలను ఏర్పాటు చేసుకొని అక్కడే ఉపాధి పొందుతున్నారు. అంతారం గ్రామంలో కొన్ని కుటుంబాలు తాటికల్లు అమ్మకంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి.
తాటికల్లే జీవనాధారంగా కుటుంబాలు..
అంతారం, తిర్మలాపూర్, ఇప్పాయిపల్లిలోని కొన్ని కుటుంబాలకు తాటి కల్లు అమ్మకమే జీవనాధారమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెట్ల కిందే కూర్చొని కల్లు విక్రయిస్తున్నారు. తాటి కల్లు సీజన్ వచ్చిందంటే వారికి పండుగే.
చెట్టు ఉన్న ప్రాంతంలో పండించని పంటలు..
తాటి చెట్లు ఉన్న స్థలంలో మరేపంటలు పండించడానికి రాదని పలువురు తాటి చెట్ల పెంపకం దారులు పేర్కొంటున్నారు. సంవత్సరానికి తాటికల్లు సీజన్లో మాత్రమే తీయడానికి వీలు ఉంటుంది. మిగతా సమయంలో పొలాలు బీడుగానే ఉంటాయని పేర్కొంటున్నారు.
గీత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించిన ప్రభుత్వం
తాటిచెట్టు నుంచి ముంజలు తీసే సమయంలో కొంత మంది ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి కింద పడి మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గీత కార్మికులకు లక్ష నుంచి 5లక్షల వరకు ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది.
వివిధ ప్రాంతాలకు తాటిముంజల తరలింపు
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని పలు గ్రామాలవాసులు తాటి ముంజలతో ఉపాధి పొందుతున్నారు. నిత్యం రూ.500 నుంచి రూ.2000 వరకు సంపాదిస్తున్నారు. ఉదయం 5 గంటలకే దూర ప్రాంతాలకు తీసుకెళ్లే వ్యాపారులు తాటి ముంజల విక్రయాలు చేస్తుంటారు. హైదరాబాద్, కొడంగల్, మహబూబ్‌నగర్, పరిగి, వికారాబాద్, నారాయణపేట, కర్ణాటక రాష్ట్రంలోని సేడం, గుర్మిట్కల్ ప్రాంతాలకు తాటి ముంజలను తీసుకెళ్తారు.
వేసవిలో అధికంగా వస్తుంటారు..
వేసవిలో దూర ప్రాంతాల నుంచి కల్లు కోసం జనం వస్తుంటారు. తాటికల్లు, ముంజలతో రోజుకు రూ.వెయ్యి నుంచి రెండు వేల వరకు వస్తారు. ఇప్పాయిపల్లి, తిర్మలాపూర్, అంతారం గ్రామాల్లో ఎప్పుడు జనాలు ఉంటారు.
– మొగులయ్య, అంతారం కులకచర్ల మండలం
ఉదయం, సాయంత్రం తాటి చెట్లు ఎక్కుతాం..
ఉదయం, సాయంత్రం చల్లటి వాతావరణంలో తాటిచెట్టు ఎక్కి కల్లును తీసి ఇస్తాం. వేసవి కాలం ఉన్నందున కల్లుకు గిరాకీ బాగానే ఉంటుంది. నిత్యం రెండు నుంచి మూడు సార్లు తాటి చెట్టు ఎక్కి కల్లును తీస్తుంటాం.
– విజయ్, గీత కార్మికుడు అంతారం
గుర్తింపు కార్డులు, లైసెన్సులు అందజేయాలి..
గీత కార్మికులకు గుర్తింపు కార్డులు, లైసెన్సులు ఇవ్వాలి. లైసెన్సులు లేనికారణంగా ప్రమాద బీమా వచ్చే అవకాశం లేదని బీమా కంపెనీలు, అధికారులు తెలియజేస్తున్నారు. తాటిచెట్లపై నుంచి ఇప్పటికీ ఎందరో పడిన సంఘటనలు ఉన్నాయి.
– జ్యోగు వెంకటయ్యగౌడ్, గీత కార్మిక సంఘం సభ్యుడు కులకచర్ల