షాద్నగర్ రూరల్, మే 9 : పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఆడపడచుల పెండ్లి అంటే కట్నాలు, కానుకలని ఖర్చుతో కూడుకున్న తంతు కాబట్టి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యేవారు. పెండ్లి చేయాలంటేనే అప్పులు చేయాల్సిన పరిస్థితి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పేదలకు కొంతమేర ఆసరా అవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెక్కులు అందుకున్న లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
నియోజకవర్గంలో 6690 మందికి లభ్ధి..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఇప్పటి వరకు షాద్నగర్ నియోజకవర్గంలో 6,690 మంది లబ్ధిదారులకు రూ.61,64,34339 చెక్కులు అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2017-18 సంవత్సరానికిగాను నియోజకవర్గంలో 791 మంది లబ్ధిదారులకు రూ.7,91,91,756 చెక్కులను అందజేశారు. 2018-2019లో 1016 లబ్ధిదారులకు రూ.10,17,17656, 2019-2020కిగాను 2350 మంది లబ్ధిదారులకు రూ.23,52,72600 చెక్కులను పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.