బడంగ్‌పేట, మే 9 : సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలో నేరాలను కట్టడి చేస్తూ.. శాంతి భద్రతలను పరిరక్షించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. భద్రత ఉన్న చోటనే అభివృద్ధి ముందుకు సాగుతుందనే ఉద్దేశంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట, బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో టీఎస్ఐఐసీ సహకారంతో రూ.2.91 కోట్లతో ఏర్పాటు చేసిన 284 కమ్యూనిటీ సీసీ కెమెరాలను సోమవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ మహేశ్ భగవత్, ఐపీఎస్ అధికారి సుధీర్‌బాబు, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, మేయర్ పారిజాత, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, టీఎస్ఐఐసీ సీజీఎం, అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం జిల్లెలగూడ సామ యాదిరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ప్రసంగించారు.
ప్రతి ఇంట్లో సీసీ కెమెరా ఉంటే మంచిది
మహేశ్వరం నియోజకవర్గంలో టీఎస్ఐఐసీ, సీఎస్ఆర్కు చెందిన రూ.3.50 కోట్ల నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఇందుకు కృషిచేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ను అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. మున్సిపాలిటీల్లో ఇండ్ల పర్మిషన్లు జారీ చేసేటప్పుడు కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించాలని అధికారులను ఆదేశించారు. చెరువులను సుందరీకరించడంతో కట్టలపై ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి చాలా మంది వస్తున్నారని, ఆయా చెరువు కట్టలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని సూచించారు.
రాష్ట్రంలో 9.21లక్షల సీసీ కెమెరాలు: డీజీపీ మహేందర్‌రెడ్డి
నేర రహిత రాష్ట్రమే.. సీఎం కేసీఆర్ లక్ష్యమని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే టెర్రరిజం, మత కలహాలు, నక్సలిజంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, స్వరాష్ట్రంలో మత కలహాలు, నక్సలిజం, టెర్రరిజానికి తావు లేకుండా శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 9.21లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐలు మహేందర్‌రెడ్డి, భాస్కర్, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.