పెద్దఅంబర్‌పేట, మే 8: చెరువునే నమ్ముకుని తరాలు కష్టప డ్డాయి.. ‘చెరువు బాగు పడాలి, దాంతో మనమూ ఎదగాలి’ అన్న సంకల్పంతో పెద్దలు పడ్డ కష్టానికి ఫలితాలు రావడం మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు.. 64 కుటుంబాలు ఒక్కటై పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని కుంట్లూరు చెరువును బాగు చేసుకున్నాయి. రెండేండ్ల నుంచి చేపలు చేతికి వస్తుండటంతో మురిసిపోతున్నాయి.
చెరువు బాగుకు కదిలి..
కుంట్లూరు చెరువులో ముళ్ల పొదలు మొలిచి అధ్వానంగా ఉండేది. అడుగు పెట్టేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. రెం డు దశాబ్దాలు ఇదే పరిస్థితి. మూసీ నీళ్లు కలువడంతో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. గ్రామంలోని మత్స్యకారులు, రజకుల ఉపాధికి ఇదే దిక్కుగా ఉండేది. చెరువులో నీళ్లు పాడయి చాలామంది రజక వృత్తిని మానేసుకున్నారు. మత్స్య కారులు సైతం చేపలు పట్టడాన్ని మరిచిపోయారు. గ్రామం లోని మత్స్యకార కుటుంబాలు చెరువును బాగు చేసుకోవాలని సంకల్పించాయి. అందరూ సంఘంగా ఏర్పడ్డారు. సొంతంగా లక్షల్లో నిధులు వెచ్చించారు. చెరువులోని చెత్తాచెదారం లేకుండా చేశారు. ముళ్లపొదలను తొలగించారు. ప్రజా ప్రతి నిధుల సహకారంతో మురుగు నీరు చెరువులో కలువకుండా చర్యలు చేపట్టారు. ఫలితంగా చెరువు బాగయింది. ఇప్పుడు 64 కుటుంబాల ఉపాధికి చెరువు ఆదరు వయింది.
రెండేండ్లుగా చేతికి చేపలు..
చెరువులో చేపలు వేస్తుండటంతో రెండేండ్లుగా చేతికి వస్తున్నా యి. గత ఏడాది చెరువులో వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 వేల చేప పిల్లలను పంపిణీ చేసింది. గ్రామంలోని మత్స్యకారులు మరో 3 లక్షల చేప పిల్లలను చెరువులో వదిలారు. ఫలితంగా కుటుంబాలకు ఉపాధి లభించింది. ఈ ఏడాది సైతం రాష్ట్ర ప్ర భుత్వం 50 వేల చేపపిల్లలను అందించగా.. తాము మరో 3 లక్షల వరకు పిల్లలను చెరువులో వేశామని కుంట్లూరు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు జోర్క శ్రీరాములు, సహకార సంఘం నాయకులు సాదు శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరిగాయని పేర్కొం టున్నారు. ఆదివారం చేపలకు వల వేస్తున్నామని తెలిపారు. దీనిపై ముందురోజు చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేస్తున్నట్టు వెల్లడించారు.
ఎన్నో కుటుంబాలకు ఉపాధి..
చెరువును మంచిగా చేసుకోవడంతో ఎన్నో కుటుంబాలకు ఉపాధి దొరికినట్లయింది. రెండేండ్లుగా చెరువులో చేప పిల్లలను వదులుతున్నాం. 64 కుటుం బాలకు ఉపాధి దొరికింది. ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా ఇవ్వడం సంతోషకరం. – జోర్క శ్రీరాములు, సాదు శ్రీనివాస్,
కుంట్లూరు మత్స్య సహకార సంఘం నాయకులు