రంగారెడ్డి, మే 7 (నమస్తే తెలంగాణ) :ప్రతి బిడ్డకు మొదటి గురువు అమ్మ… ప్రతి ఒక్కరికి మార్గదర్శి అమ్మ…ప్రతి వ్యక్తికి స్ఫూర్తి ప్రదాత అమ్మ… ఇలా ప్రతి విషయంలోనూ తల్లి పాత్ర చాలా గొప్పది. నవ మాసాలు మోసి జన్మనివ్వడంతోపాటు పుట్టిన తర్వాత తన బిడ్డ ప్రయోజకులు కావాలని, సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మొదట కలలు కనేది తల్లి. ఆ కలలను సాకారం చేస్తూ అనేక మంది జీవితంలో చాలా గొప్ప స్థాయికి ఎదిగారు. ఇంకా అనేక మంది అదే మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది తల్లులు తమ పిల్లల ఎదుగుదలలో చేదోడుగా నిలుస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రులు ఇద్దరిలో పిల్లలకు తల్లి దగ్గరే చనువు ఎక్కువ. ప్రతి చిన్న అంశాన్ని తల్లితోనే వారు పంచుకుంటారు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు మొదలుకొని అనేక విషయాల్లో తండ్రి కంటే అధికంగా తల్లితోనే వారు తమ ఆలోచనలు పంచుకుంటారు. బిడ్డ చెప్పిన ప్రతి అంశాన్ని తల్లి తన మనసులో పెట్టుకొని, వారికి మంచి చేసే అంశాలను తెలియజేస్తూ జీవితాంతం తమ పిల్లలకు తల్లులు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.
అమ్మా.. నీకు వందనం
కొందుర్గు, మే 7: జిల్లెడు చౌదరిగూడ మండలంలోని పద్మారం గ్రామానికి చెందిన సాయబుగారి పద్మమ్మ భర్త సుధాకర్‌గౌడ్ 16 డిసెంబర్ 2005లో మృతి చెందాడు. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త చనిపోవడంతో కుటుంబ భారం ఆమెపై పడింది. తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నది. అలాగే ఆశ వర్కర్‌గా విధులు నిర్వహిస్తూ కుమార్తెలను చదివిస్తున్నది.
పెద్ద కుమార్తె శిరీషను డిగ్రీ వరకు చదివించి పెండ్లి చేసింది. రెండో కూతురు అఖిల ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నది. మూడో కుమార్తె పూజిత ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నది. భర్త చనిపోయినా పిల్లలను ఉన్నత చదువులు చదివించి సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నది పద్మమ్మ. తండ్రి లేకున్నా తమను చదివించిందని పద్మమ్మ పిల్లలు అంటున్నారు. మదర్స్ డే సందర్భంగా పద్మమ్మకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు
సృష్టిలో తల్లిని మించిన దైవం మరొకటి లేదు. ఆమనగల్లు గ్రామానికి చెందిన చంద్రమౌళి, వేణమ్మ దంపతులు బతుకు దెరువు కోసం షాద్‌నగర్ పట్టణానికి గత 20 ఏండ్ల క్రితం వచ్చారు. పట్టణంలోని గాంధీనగర్‌కాలనీలో చంద్రమౌళి టైలర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పిల్లల చదువుకు చంద్రమౌళి సంపద సరిపోకపోవ డంతో వేణమ్మ పరిశ్రమలో పనిచేసి కుటుంబ పోషణలో సహాయపడేది. ఈ నేపథ్యంలో చంద్రమౌళి గత ఐదేండ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ పోషణ భారం వేణమ్మపై పడింది. తమ పిల్లల చదువుకు ఆటంకం కలుగవద్దని ఆమె టైలరింగ్ పనిచేస్తూ పిల్లలను చదివిస్తున్నది. ఇద్దరు కుమారులు ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఎంత కష్టమైనా తమ పిల్లలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వాలనే లక్ష్యంతో వేణమ్మ ముందుకు సాగుతున్నారు.
అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం
యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన బండారు మంగమ్మ అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. మంగమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లలు చిన్నగున్నప్పుడే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబ భారమంతా ఆమెపై పడింది. దీంతో ఆమె నమ్ముకున్న వృత్తిలో రాణిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. పోచంపల్లి నుంచి చీరలు నేసే ధారాన్ని తీసుకొచ్చి కూలీకి తన ఇంట్లో మగ్గంపై స్వయంగా చీరలను తయారు చేస్తున్నది. ధారం వడకడం, రంగులు అద్దడం, మగ్గంపై చీరలను నేయడం మంగమ్మ వృత్తి. ఒక్క చీరను నేసేందుకు రూ.1200 తీసుకుంటుంది. ఇలా నెలలో నాలుగు చీరలను నేసి తిరిగి పోచంపల్లికి పంపిస్తుంది. ఇలా కుల వృత్తిని నమ్మకొని ఎన్నో ఇబ్బందులు పడుతూ పిల్లలను పెంచి, పోషించి, చదివించి, పెండ్లీలు చేసింది. నేటికీ మగ్గంపై చీరలను నేస్తూ గ్రామీణ ప్రాంతంలో చేనేత వృత్తికి జీవం పోస్తున్నది. తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నది మంగమ్మ.
భర్తను కోల్పోయినా పిల్లలకు భవిష్యత్‌ను ఇచ్చింది..
భర్త మరణించినప్పుడు పిల్లలు చాలా చిన్న వయస్సులో ఉన్నారు… పిల్లల భవితే లక్ష్యంగా .. వారి పోషణ కోసం ఎన్నో ఇబ్బందులకు గురై వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దింది మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మమ్మ.. మోర అనంత య్య, పద్మమ్మలకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. వారికి రెండు ఎకరాల పొలం ఉన్నది. అయితే పెద్ద కుమారుడు రమేశ్ వయ స్సు 13 ఏండ్లు ఉన్న సమయంలో అనంతయ్య చనిపోయాడు. మిగతా ముగ్గురు పిల్లలు చాలా చిన్న వారు. నలుగురు పిల్లలను పోషించడం పద్మమ్మకు చాలా భారంగా మారింది. అయినా ఆమె మొక్కవోని ధైర్యంతో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వ్యవసాయ పనులు చేసుకుంటూ, కూలీ పనులు చేస్తూ నలుగురు పిల్లలను చదివించింది.
పెద్ద కుమారుడు పదోతరగతి పూర్తి చేసిన వెంటనే అతడు ఆర్మీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏండ్ల వయస్సులో అతడు ఆర్మీలో చేరాడు. పెద్ద కుమారుడి కష్టం, ఆమె వ్యవసాయ పనులు చేసుకుంటూ మిగతా పిల్లలను ఉన్నత చదువులు చదివించింది. రెండో కుమారుడు ముఖేశ్ కానిస్టేబుల్‌గా, కుమార్తె మాధవి టీచర్‌గా, మూడో కుమారుడు నరేశ్ యూనియన్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ప్రస్తుతం విధులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పద్మమ్మను ఆమె పిల్లలు బాగా చూసుకుంటున్నారు.
చదువుతోనే జీవితంలో ఎదుగుతారని చెప్పేవారు..
మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువాలి, చదివితేనే జీవితంలో బాగా ఎదుగుతారని చెప్తుండేవారు. మా అమ్మ ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నా. మేం నలుగురం అన్నదమ్ములం కూడా మా అమ్మ ప్రోత్సాహంతో ఉన్నత చదువులను పూర్తి చేశాం. నా ప్రతి విజయంలోనూ
మా అమ్మ పాత్ర ఉంది. అమ్మ రుణం తీర్చుకోలేది.
– గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ
మా అమ్మ ఆశీర్వాదంతోనే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా…
మా అమ్మ ఆశీర్వాదంతోనే నేను మూడు సార్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచా. నేను మొదట 1981లో సర్పంచ్‌గా పోటీ చేసిన సమయంలో మా అమ్మ ఊరంతా ప్రచారం చేసి నా గెలుపునకు కృషి చేశారు. మేం నలుగురం అన్నదమ్ములం, నేను పెద్ద కుమారుడ్ని కావడంతో చిన్నప్పటి నుంచే నన్ను మా అమ్మ ఆప్యాయంగా చూసుకునేది. మేం హైదరాబాద్‌లో చదువుకునే సమ యంలోనూ మాతోపాటు ఉండి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిం చింది. ప్రస్తుతం మా అమ్మ వయస్సు 92 ఏండ్లు అయినప్పటికీ మాపై మా అమ్మకు, మా అమ్మపై మాకు అదే ప్రేమ ఉంది.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
ఇప్పటికీ అమ్మ ఆశీర్వాదం తీసుకుంటా..
మా అమ్మ మమ్మల్ని క్రమశిక్షణతో పెంచడంతోనే సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగా. చిన్నప్పటి నుంచే నన్ను చాలా ప్రేమగా పెంచింది. ఇప్పటికీ నేను ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మొదట నేను మా అమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుంటా.
– జైపాల్ యాదవ్, కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే
మా అమ్మ ప్రోత్సాహాన్ని మరువలేను
చిన్నప్పటి నుంచి మా అమ్మ ప్రోత్సాహాన్ని నేను మరువలేను. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉండేందుకు మా అమ్మే కారణం. చిన్నప్పటి నుంచే అమ్మతో నాకు అనుబంధం ఎక్కువ. ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఇప్పటికీ మొదటగా అమ్మతోనే పంచు కుంటా. నా ప్రతి విజయంలోనూ మా అమ్మ కృషి ఎంతో ఉంది. అమ్మకు కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజూ అమ్మదే. మదర్స్‌డే రోజు శుభాకాంక్షలు చెప్పి బహుమతి ఇస్తే సరిపోదు, అమ్మను బతికి ఉన్నన్ని రోజులు ప్రేమగా చూసుకోవడమే మనం అమ్మకు ఇచ్చే నిజమైన బహుమతి.
-అమయ్‌కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్
అమ్మ పస్తులుండి మా కడుపు నింపింది..
చిన్నప్పుడు మా అమ్మ పస్తులుండి మా కడుపు నింపింది. మొదట్నుంచి అయిన మేం బాగుం టే చాలని కోరుకునేది. ఇప్పటికీ ప్రతిరోజూ బయటికి వచ్చేటప్పుడు మా అమ్మ ఆశీర్వాదం తీసుకొనే బయలుదేరుతా. ఇప్పటికీ సమాజంలో జరిగే దానికి సంబంధించి మంచి, చెడులను చెప్తు ఉంటుంది. మా అమ్మ, నాన్నల ఆశీర్వాదంతో నా జీవితంలో విజయాలే తప్పా అపజయాల్లేవు. వరుసగా ఎమ్మెల్యేగా గెలిచానంటే మా అమ్మ ఆశీస్సులతోనే. కానీ ఈరోజుల్లో బిడ్డల కోసం జీవితం ధారబోసే అమ్మను చివరకు చూడలేక వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. అంతేకాకుండా సంపాదించింది అంతా ఖర్చు చేసి విదేశాల్లో చదివిస్తే, అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడి.. చివరి చూపునకు కూడా దూరమవుతున్నారు. అమ్మ ప్రేమ, అమ్మ దీవెన లేకుండా ఎన్ని కోట్లు సంపాదించినా అది వృథానే.
– కాలె యాదయ్య, చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే
అమ్మ కల నెరవేర్చేందుకే డాక్టర్ అయ్యా..
మా అమ్మ కలను నెరవేర్చేందుకే నేను డాక్టర్ అయ్యా. నా తల్లిదం డ్రులు ఇద్దరు అనంతగిరి దవాఖానలో పనిచేసేవారు. నేను చిన్నగా ఉన్నప్పుడు వారి వెంటే దవాఖానకు వెళ్లేవాడిని. అక్క డ పనిచేసే డాక్టర్లను చూసేవాడ్ని.. వారు దవాఖానలో రోగులకు అందించే సేవలు దగ్గరుండి చూశా. అప్పట్లోనే నేను డాక్టర్ కావాల ని మా అమ్మనాన్న కోరుకున్నారు. ప్రధానంగా మా అమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలని కోరుకున్నది. ఆమె కలను సాకారం చేసేందుకే నేను డాక్టర్‌ను అయ్యా. అనంతరం డాక్టర్‌గా మంచిపేరు తెచ్చుకోవడంతోపాటు ఎమ్మెల్యేను కాగలిగాను. నాకు స్ఫూర్తిగా నిలిచిన అమ్మకు కృతజ్ఞతలు. – డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే
అమ్మతో అనుబంధం విడదీయరానిది
అమ్మతో మాకున్న అనుబంధం విడదీయరానిది. చిన్నతనంలో మేనమామ వారింట్లో పెరుగడంతో అమ్మకు దూరమయ్యా. కానీ అమ్మ ప్రేమకు మాత్రం దూరమవ్వలేను. నా భర్త స్వర్గీయ మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి మరణించిన సమయంలో నాకు ధైర్యాన్నిచ్చిన మా అమ్మ, నాన్న చాలా ఆప్యాయంగా చంటిపిల్లలా చూసుకున్నారు. మా అమ్మ ప్రోత్సాహం మరువలేనిది. అమ్మ రుణం తీర్చుకోలేం.
– పి.సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
అమ్మతోనే అనుబంధం ఎక్కువ..
చిన్నప్పటి నుంచి నాకు అమ్మతోనే అనుబంధం ఎక్కువ. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే మా నాన్న రాజకీయాల్లో ఉండటంతో అధికంగా అమ్మతోనే ఉండేది. పెంపకం దగ్గర నుంచి నేను వ్యా పారంలో, రాజకీయాల్లో ఎదిగేందుకు సైతం మా అమ్మే స్ఫూర్తిగా నిలిచింది. చదువుకునే రోజుల దగ్గర నుంచి నేను ఎమ్మెల్యేగా గెలుపొందే వరకు సైతం మా అమ్మ నాకు అన్ని విషయాల్లో సహకరిస్తూ వచ్చింది. ఆమె పెంపకంలో అనేక విషయాలపై అవగాహన ఏర్పడింది. మదర్స్‌డే సందర్భంగా అమ్మకు శుభాకాంక్షలతోపాటు కృతజ్ఞతలు.
– కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే
నాకు గైడ్ మా అమ్మ
నాకు మా అమ్మ గైడ్. నాన్నతో కంటే అమ్మతోనే అనుబంధం ఎక్కువ. నాకు సంబంధించి మంచి, చెడు ప్రతి విషయాన్ని అమ్మతోనే పంచుకుంటా. చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం వచ్చినా, ఏది అవసరమైనా, ప్రతి అంశాన్ని అమ్మతోనే షేర్ చేసుకుంటా. ఆమె నాకు ప్రతి విషయంలోనూ వెన్నంటి నిలిచి నాకు గైడ్ చేస్తుంది. ఆమె చూపించిన మార్గంలోనే నడుస్తున్నా. చిన్నప్పటి నుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత కూడా ప్రతీది అమ్మతో పంచుకొని ఆమె స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నా. మదర్స్‌డే సందర్భంగా అమ్మకు శుభాకాంక్షలు..కృతజ్ఞతలు.
– శుభప్రద్ పటేల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు
అమ్మ పిలుపులోనే ప్రేమ, ఆప్యాయత ఉంది..
అమ్మ అనే పిలుపులోనే ప్రేమ, ఆప్యాయత ఉంది. అమ్మ ఎల్లప్పుడూ బిడ్డల ఉన్నతిని కోరుకొంటుంది. మా అమ్మ పట్నం రుక్కమ్మ నా చిన్ననాటి నుంచి కూడా అన్నింటా నా విజయానికి వెన్నంటే ఉండి ఆశీర్వదిస్తున్నది. కాబట్టే నేడు నేను మా అన్న పట్నం మహేందర్‌రెడ్డి ఇద్దరం ప్రజా సేవలో కొనసాగుతూ అందరి మన్ననలను పొందుతున్నాం. నేటికీ అమ్మ మా ఇద్దరు అన్నదమ్ముళ్ల యోగక్షేమాలను తెలుసుకొంటుంది. ఎటువంటి కార్యం తలపెట్టినా అమ్మ ఆశీర్వాదం తీసుకొని ముందుకు సాగుతాము. అమ్మను కంటికి రెప్పలా చూసుకొంటున్నాం
– ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి