పెద్దేముల్, మే 7 : ప్రభుత్వాలు చేసే చట్టాలపై గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తాండూరు జూనియర్ సివిల్ జడ్జి స్వప్న అన్నారు. శనివారం తట్టేపల్లి గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ, న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులతోపాటు ప్రభుత్వ చట్టాలకు లోబడి చట్టాలను గౌరవిస్తూ తమ జీవన విధానాన్ని కొనసాగించాలన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పిదాలవల్ల ఆర్థికంగా, సామాజికంగా ఎంతో విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తట్టేపల్లి గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. వాటిని నిరోధించడానికి పోలీసులు ఈ ప్రాంత ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు.
తాండూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తట్టేపల్లి ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉందని, ఇక్కడ బాల్య వివాహాలు, భూవివాదాలు అధికంగా ఉంటాయని గ్రహించి న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రామమ్మ, ఎంపీటీసీ శంకర్, తాండూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, సహ కార్యదర్శి రజిత, కోశాధికారి సుదర్శన్, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, సీనియర్ న్యాయవాదులు శివకుమార్, శ్రీనివాస్, నర్సింగ్‌రావు, రవీందర్, సోఫియా బేగం, రవికుమార్, విశ్వనాథన్, వాణిశ్రీ, బందెప్ప పాల్గొన్నారు.