షాద్నగర్ టౌన్, మే 7: అసంక్రమిత వ్యాధులపై పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని అసంక్రమిత వ్యాధుల(ఎన్సీడీ) అదనపు డైరెక్టర్ డాక్టర్ పుష్ప వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం ఆమె పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రాజెక్టు ఆఫీసర్ సల్మాన్, ప్రోగ్రామ్ ఆఫీసర్ సౌమ్య, డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్తో కలిసి డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అసంక్రమిత వ్యాధుల కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్, క్యాన్సర్, ఆస్తమా, గుండెకు సంబంధించిన వ్యాధులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ వ్యాధు లు ఎలా వస్తాయి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలనే విషయాలను క్షుణ్ణంగా వివరించాలని సూచించారు. పట్టణంతోపాటు గ్రామీణ ప్రాం తాల్లో అసంక్రమిత వ్యాధుల బారిన పడిన వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. వైద్య సిబ్బంది నమోదు చేసిన వివరాల ప్రకారం వారికి ప్రతినెలా మందులను పంపిణీ చేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో వైద్యులు కవిత, అమ్రిత్, జయప్రకాశ్, వసంత, విజయలక్ష్మి, ఆనంద్, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.