కేశంపేట, మే 6 : గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. కేశంపేట మండలంలోని అల్వాల గ్రామపంచాయతీ అభివృద్ధిలో అగ్రగామి నిలుస్తున్నది. ప్రతి కాలనీకి సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ఏర్పాటు, హరితహారంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. గ్రామానికి వచ్చే ప్రధానరోడ్డు వెంట మొక్కలు ఏపుగా పెరుగడంతో రోడ్డుకు కొత్త కళ వచ్చింది. గ్రామంలోని ప్రతి వీధిలో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుతో రాత్రి వేళల్లోనూ గ్రామమంతా పండు వెన్నెలను తలపిస్తున్నది. ప్రతి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడంతో స్వచ్ఛ గ్రామంగా తయారైంది. చివరి మజిలీ కోసం గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం అన్నివర్గాల ప్రజలకు ఉపయోగపడుతున్నది. గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. మూడేండ్లుగా ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేయడంతో గ్రామస్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు సమకూరాయి.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం..
అల్వాల గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. ప్రజాప్రతినిధులు, పంచాయతీ పాలకవర్గం సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ల సహకారంతో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటున్నాం. ఉత్తమ పంచాయతీగా ఎంపికయ్యేలా శక్తివంచన లేకుండా చేస్తాం.
– తిరుమలరెడ్డి శ్రీలత, సర్పంచ్, అల్వాల, కేశంపేట మండలం