బొంరాస్పేట, మే 5 : ఎండాకాలం వచ్చిందంటే చాలు తం డాలు దాహార్తితో తల్లడిల్లేవి. గుక్కెడు నీటి కోసం మహిళలు బిందెలు చేతపట్టుకుని కిలోమీటర్ల దూరం నడిచి వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకునేవారు. తాగునీటి కోసం మహిళలు కూలీ పనులు వదులుకుని బోర్లవద్ద పడిగాపులు పడేవారు. నీటి సమస్య తీర్చాలని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ధర్నాలు చేసేవారు. ఉన్న బోర్లలో నీళ్లు అడుగంటిపోగా కొత్త బోర్లు వేసినా భూగర్భ జలాల తగ్గుదలతో నీళ్లు వచ్చేవి కావు. మండలంలోని బొట్లవాని తండా, పూర్యానాయక్తండా, బుర్రితండా, టేకులగడ్డతండా, కట్టుకాల్వతండా, భోజన్నగడ్డతండా, దేవులానాయక్తండా వంటి అనేక తండాల్లో తీవ్రమైన మంచినీటి సమస్య ఉండేది. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తాగునీటి కోసం మండలంలోని గిరిజన తండాల ప్రజలు పడేపాట్లు.
కానీ తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని మిషన్ భగీరథ అనే ఓ బృహత్తర పథకానికి రూపకల్పన చేశారు. సీఎం ముందు చూపుతో రూపొందించిన ఈ పథకమే నేడు అనేక గ్రామాలు, తండాల ప్రజల దాహార్తిని తీరుస్తుంది. మండు వేసవిలో కూడా ప్రజలు ఇళ్లవద్దే ఉంటూ నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీటిని పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడిన బొంరాస్పేట మండలంలోని అనేక గిరిజన తండాలకు నేడు మిషన్ భగీరథ పుణ్యమా అని నిరంతరాయంగా నీటి సరఫరా జరుగుతుంది. దీంతో గత ఐదారేండ్ల నుంచి ప్రజలు ముఖ్యంగా మహిళలు నీటి సమస్య తీరినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మిషన్ భగీరథ పథకం ద్వారా మండలంలోని 84 గిరిజన తండాలలో రూ.15 కోట్ల వ్యయంతో 87 ఓహెచ్ఎఆర్ ట్యాంకులు నిర్మించారు.
మెయిన్ పైపులైన్ నుంచి తం డాలకు పైపులైన్లు వేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ప్రతి మనిషికి రోజుకు వంద లీటర్ల చొప్పున స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నారు. అధికారికంగా వంద లీటర్లు అని లెక్కలున్నా దానికి మించి ఉదయం, సాయంత్రం పూట నీటి సరఫరా జరుగుతుంది. 2018లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పట్నం నరేందర్రెడ్డి మండలంలో మిషన్ భగీరథ పథకం పూర్తికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ అన్ని తండాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు. కొడంగల్ సమీపంలోని సిద్దనొంపు వద్ద నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి మండ లంలోని గ్రామాలు, తండాలకు నిత్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా నీటి సరఫరా జరుగుతుంది. ఉదయమే ఇంటి ముందు నీళ్లు వస్తుండడంతో మహిళలు నీళ్లు పట్టుకుని తమ పనులకు తాము సంతోషంగా వెళ్తున్నారు.
నీటి కష్టాలు తీరాయి..
మిషన్ భగీరథ పథకం ద్వారా తండాకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. ఈ పథకం అమ లుకాకముందు మంచినీటికి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. వేసవి వచ్చిదంటే చాలు మంచినీటి గురించే ఆలోచన. భూగర్భ జలాలు తగ్గి బోర్లు పనిచేసేవి కావు. మిషన్ భగీరథ పథకం వచ్చిన తరువాత రెండేండ్ల నుంచి ఇంటింటికీ మంచినీరు అం దుతుంది. ఇప్పుడు నీటి కష్టాలు పూర్తిగా తీరాయి.
–సరిత, బుర్రితండా
ఇంటింటికీ నల్లా నీరు
మిషన్ భగీరథ పథకం వచ్చిన తరువాత ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. రెండేళ్ల నుంచి ప్రతి రోజూ మంచినీళ్లు వస్తున్నాయి. మిషన్ భగీరథ రాకముందు మా తండాలో నీటి కష్టాలు ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని బోర్లు వేసినా నీళ్లు రాలేదు. బోర్లు పనిచేసేవి కావు. ఏడాది మొత్తం తాగునీటికి ఇబ్బందులు పడేవాళ్లం. పిల్లలు, పెద్దలు బిందెలు పట్టుకుని వ్యవసాయ పొలాలకు వెళ్లి తెచ్చుకునే వాళ్లం.
–పుటానీబాయి, దేవులానాయక్తండా
మిషన్ భగీరథ గొప్ప పథకం
మిషన్ భగీరథ గొప్ప పథకం. గిరిజన తండా ప్రజల తాగునీటి గోస తీర్చింది. గతంలో వేసవి కా లం వచ్చిం దంటే చాలు మంచి నీటికి ఎన్నో కష్టాలు. కూలీ పనులు మానుకుని బిందెడు నీళ్ల కోసం పడిగాపులు పడేవాళ్లు. ఇప్పుడు ఆ తిప్పలన్నీ లేవు. మంచిగా ఇంటిముందే నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇంటింటికీ నీళ్లు రావడంతో అందరం సం తోషంగా ఉన్నాం.
–మోతీబాయి, మాజీ ఎంపీటీసీ బొట్లవానితండా