మంచాల, మే 4 : పల్లెసీమల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామం ప్రగతి పథకంలో తీసుకెళ్లుతున్నది. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామంలో కొత్తశోభ సంతరించుకున్నది. మంచాల మండలం ఎల్లమ్మతండా పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు మారడమే కాకుండా స్వచ్ఛతలో ఆదర్శంగా నిలిచింది. సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామం అభివృద్ధితో పాటు స్వచ్ఛతకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.90లక్షల నిధులతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, వైకుంఠధామం, వర్మీ కంపోస్టుయార్డు, పల్లెప్రకృతి వనం కోసం నిధులు కేటాయించారు. ప్రతి రోజూ వార్డుల్లో పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించడం, హరితహారంలో నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడం వంటి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. గ్రామంలో ఏ వీధి చూసినా సీసీరోడ్లతో పాటు వీధి దీపాలు కనిపిస్తున్నాయి.
పూర్తైన పనుల వివరాలు
ఎల్లమ్మతండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. రూ.12.50లక్షలతో వైకుంఠధామం, రూ.5లక్షలతో వర్మీ కంపోస్టు యార్డు రూ.లక్షతో పల్లెప్రకృతి వనం, రూ.5.40లక్షలతో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ కొనుగోలు చేశారు. సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీలు, సీసీకెమెరాల ఏర్పాటుతో పాటు నిత్యం వీధులను శుభ్రం చేయడానికి సిబ్బందిని నియమించి సమస్యల పరిష్కారానికి పాలకవర్గంతో పాటు యువకులు కూడా సహాయసహకారాలతో ఎల్లమ్మతండా ముందుంది.