రంగారెడ్డి జిల్లాలో 156 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
పరీక్షలకు హాజరుకానున్న 1,15,366 మంది విద్యార్థులు
మొదటి ఏడాది- 59,694, ద్వితీయ ఏడాది-55,672 మంది విద్యార్థులు
సున్నిత, అతి సున్నిత పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
రంగారెడ్డి, మే 3 (నమస్తే తెలంగాణ): ఈ నెల ఆరు నుంచి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారం భం కానున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ, వైద్య, ఇంటర్‌బోర్డు అధికారులతో ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు జిల్లాలోని సున్నిత, అతి సున్నిత పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పా టు చేయనున్నారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు..
ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల్లో పక్కా నిఘా పెట్టనున్నారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులను జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 6 నుంచి 24వతేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. కాగా రంగారెడ్డి జిల్లాలో ప్రథమ, ద్వితీయ రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిసి 1,15,366 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి ఏడాది విద్యార్థులు-59,694 మంది కాగా.. ద్వితీయ ఏడాది 55,672 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో అధికారులు 156 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఫ్ల్లయింగ్ స్కాడ్ బృందాలతోపా టు సిట్టింగ్ స్కాడ్ బృందాలను కూడా ఏర్పా టు చేశారు. తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ లెక్చరర్లతో కూడిన 28 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలనూ జిల్లా ఉన్నతాధికారులు నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసి వేయనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్‌ఎంతోపాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. అదేవిధంగా విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
పరీక్షలకు అంతా సిద్ధం..
రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేశాం. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.
– వెంక్యానాయక్, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి