కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో మంత్రులు సబితారెడ్డి, హరీశ్‌రావు
పాల్గొన్న రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్
షాబాద్, మే 2: మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం వలె చేపట్టి, పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి సకల సౌకర్యాలతో సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలెక్టర్లకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో మన ఊరు-మనబడి కార్యక్రమంపై మంత్రులు సబితారెడ్డి, తన్నీరు హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేసి ఒక యజ్ఞం లాగ, ఒక పండుగ లాగ చేపట్టి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయాలన్నారు.
చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రత్యేకాధికారులు స్వయంగా పర్యవేక్షించి పనులు వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు. నాడు నేడు అన్నట్లుగా మరమ్మతులు చేయకముందు మరమ్మతులు పూర్తి అయ్యాక పాఠశాల ఫొటోలు, వీడియోలు తీయించి సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం నిర్వహించాల్సిందిగా సూచించారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడుతలో 9123 పాఠశాలలను ఆధునీకరించి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. వాటన్నింటికీ త్వరగా అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలన్నారు. పాఠశాలలకు ప్రస్తుతం సెలవులు ఉన్నందున త్వరగా పనులు చేపట్టి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
మండుటెండల్లో ఇంటర్, పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ…మరమ్మతులు చేయాల్సిన పాఠశాలల్లో ఇప్పటివరకు పరిపాలన అనుమతులు ఇవ్వడంలో జిల్లాలు వెనకబడి ఉన్నాయని, ఈ నెల 10వ తేదీ వరకు వందశాతం పరిపాలన అనుమతులు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. రంగారెడ్డిజిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ…జిల్లాలో మొదటి విడుతలో గుర్తించిన 464 పాఠశాలలకు పరిపాలన అనుమతులు ఇచ్చి పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సూచనలు అన్ని పాటించి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానీయా, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, డీఈవో సుశీందర్‌రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.