పరిగి, జూలై 24 : యువతరానికి ఆదర్శ నాయకుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా శనివారం పరిగి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో 29వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహే శ్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు పరిగిలోని మైత్రినగర్ పార్కులో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ నెం.2లో విద్యార్థులకు ఉచితంగా డిక్షనరీలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో ఉద్యమకారుడిగా పోరాటం చేసిన కేటీఆర్, ప్రస్తుత ప్రభుత్వంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తు న్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పబడి, లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్దిపై విజన్ గల నాయకుడు మంత్రి కేటీఆర్ అని చెప్పారు.
బంగారు తెలంగాణ సాకారం కావాలి
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను శనివారం తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంతో పాటు తాండూరు యాలాల, బషీ రాబాద్, పెద్దేముల్ మండల పరిధిలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయం చైర్మన్ మురళీగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటి టీగార్డులను ఏర్పాటు చేశారు. రాజకీయ రంగంలో కేటీఆర్ పురోగతి సాధించాలని, బంగారు తెలంగాణ కల సాకారం కావాలని కోరుతూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలతో కలిసీ దేవాలయాల్లో, మసిదులో, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. ఎంఈవో వెంకటయ్య ఆధ్వ ర్యంలో ప్రభుత్వ నంబర్-1 ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డిక్షనరిలు పంపిణీ చేశారు.