ఇబ్రహీంపట్నం రూరల్, మే 2 : అన్నిరకాల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ కోవలోకే ఇప్పుడు నిమ్మకాయలు కూడా చేరాయి. ప్రసుత్తం సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొన్నది. వేసవి ప్రతాపం, రంజాన్మాసంతో నిమ్మకాయల వినియోగం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.10కి ఒక్క నిమ్మకాయ, వంద నిమ్మకాయలకు రూ.400 చొప్పున విక్రయిస్తున్నారు. ధరలు పెరుగడంతో నిమ్మకాయ నీళ్లు, సోడ, లెమన్టీలు ధనవంతుల డ్రింక్ గా మారిపోయాయి. గతేడాది నిమ్మసోడ రూ.10 నుంచి రూ.15 ఉండగా.. ఈ ఏడాది రూ.20 నుంచి రూ.30 వరకు అమ్ముతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో వంద నిమ్మకాయలు రూ.200 ఉండగా ఇప్పుడు రూ.400లకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. నిత్యావసర వస్తువులతోపాటు నిమ్మకాయల ధరలు అమాంతం పెరుగడంతో సామాన్యులు వాటిని కొనేందుకే జంకుతున్నారు.
రంజాన్ మాసంతో పెరిగిన ధరలు..
రంజాన్ మాసం కావడంతో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రంజాన్ మాసంలో హలీంకు డిమాండ్ ఎక్కువే. చాలామంది హలీం తినేందుకు ఇష్టపడుతుంటారు. హలీం తయారీ లో నిమ్మరసం వినియోగిస్తారు. హలీంలో కలుపుకొని తింటారు. ఉపవాస దీక్షల సమయం లో నిమ్మను వినియోగిస్తుంటారు.
తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన డిమాండ్..
వేసవితాపం అధికమవ్వడంతోపాటు పం ట దిగుబడి సరిగ్గా లేకపోవడం.. పెరిగిన ఇం ధన ధరలతో రవాణా చార్జీలు పెరుగడం తదితర కారణాలతో నిమ్మకాయల ధరలు సామాన్యుడికి అందనంత పెరిగాయి. రాబోయే నెలరోజుల పాటు ధరలు మరింత పెరిగే అవకాశమం ఉందని స్థానిక వ్యాపారులు పేర్కొం టున్నారు. వేసవిలో నిమ్మ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎండలు పెరిగినట్లే వినియోగం కూడా పెరిగిపోతుంది.
కొనలేని స్థాయికి..
ప్రసుత్తం ఎండలు దంచికొడుతున్నందున నిమ్మకాయలు ఇంటి అవసరాలకు బాగా ఉపయోగిస్తుంటాం. నిమ్మకాయలు కొందామని మార్కెట్కు ధరలు చూసి కొనలేకపోతున్నాం. రూ.20కి రెండు నిమ్మకాయ లు మార్కెట్లో అమ్ముతున్నారు.
– చెరుకూరి మంగ