పరిగి, మే 2: ప్రకృతి సంపద తునికాకు (బీడీ ఆకు). ప్రతి వేసవిలో వందలాది మందికి ఇది నెలరోజులపాటు ఆదాయ వనరు. ప్రతి ఏడాది మే నెలలో తునికాకును సేకరిస్తారు. వాటిని కట్టలుగా కట్టి కల్లాల్లో ఆరబెడుతారు. ఆయా యూనిట్ల వారీగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెండర్లను దక్కించుకున్న బీడీ కంపెనీల నిర్వాహకులకు సంబంధిత తునికాకును అందించే ఏర్పాట్లను అధికా రులు పూర్తి చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తునికాకు సేకరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే టెం డర్లు పూర్తి కావడంతో తునికాకు సేకరణ రెండు యూనిట్లలో ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఆరు యూనిట్ల పరిధిలో కల్లాలను ఏర్పాటుచేసి 1900 స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించాలని అధికారు లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 50 ఆకులు గల కట్టకు రూ. 2.05 చెల్లించాలని సర్కారు నిర్ణయించింది. జిల్లాలో తునికాకు సేకరణకు రూ.38.95 లక్షల ఖర్చవుతాయని అధికారులు నిర్ధారించారు.
ఆరు యూనిట్లలో తునికాకు సేకరణ..
జిల్లాలో గతంతో పోల్చితే తునికాకు సేకరణ తగ్గినా ఈ ఏడాది ఆరు యూనిట్ల పరిధిలో తునికాకును సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. జిల్లాలోని ధారూర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలో ధారూర్ యూనిట్లో 10 కల్లాలను ఏర్పాటుచేసి 300 స్టాండర్డ్ బ్యాగులు, యాలాల యూనిట్లో 5 కల్లా ల ద్వారా 300 స్టాండర్డ్ బ్యాగులు, పరిగి రేంజ్ పరిధిలోని కులకచర్ల యూనిట్లో 14 కల్లాలు ఏర్పాటుచేసి 700 స్టాండర్డ్ బ్యాగులు, కంకల్ యూనిట్లో 8 కల్లాల ద్వారా 200 స్టాండర్డ్ బ్యాగులు, తాండూరు అటవీ శాఖ రేంజ్‌లోని పెద్దేముల్ యూనిట్లో 5 కల్లాల ద్వారా 300 స్టాండర్డ్ బ్యాగులు, వికారాబాద్ అటవీ శాఖ రేంజ్‌లోని గొట్టిముకుల యూనిట్లో 7 కల్లాల ద్వారా 100 స్టాం డర్డ్ బ్యాగుల తునికాకును సేకరించాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా జిల్లాలోని 49 కల్లాల్లో(గ్రామాలు) 1900 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించే ప్రక్రియను చేపట్టారు. జిల్లాలోని కంకల్, పెద్దేముల్, యాలాల యూ నిట్ల పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికే తునికాకు సేకరణ ప్రారంభమైంది. మరో రెండు, మూడు రోజుల్లో వికారాబాద్ జిల్లాలోని మిగతా అన్ని గ్రామాల్లోనూ తునికా సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నెల రోజుల పాటు ఉపాధి..
వేసవిలో సుమారు నెల రోజులపాటు తునికాకు సేకరణతో వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. టెండర్లు పిలిచి నిర్ధారించిన యూనిట్ల పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా కల్లాలను ఏర్పాటుచేసి తునికాకును సేకరిస్తారు. ఆయా ప్రాంతాల్లో తునికాకు సేకరణను దక్కించుకున్న బీడీ కంపెనీల నిర్వాహకులు తమ కంపెనీల తరఫున కల్లేదారులను నియమించుకుంటారు. వారు ఆయా ప్రాం తాల్లో నాణ్యతగా ఉన్న తునికాకును ప్రజల నుంచి సేకరిస్తుంటారు.
ఆన్లైన్లో చెల్లింపులకు ఏర్పాట్లు
తునికాకును తీసుకొచ్చే వారికి ఆన్లైన్లో డబ్బులను చెల్లించేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు కల్లానికి తునికాకును తీసుకొచ్చిన వారి నుంచి బ్యాంకు ఖాతా పాసు పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను తీసుకుని..వారు ప్రతిరోజూ తీసుకొచ్చిన తునికాకును బట్టి డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. దీని ద్వారా డబ్బుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగే ఆస్కారం ఉండదు. గతేడాది ఆన్లైన్లో డబ్బులను చెల్లించాలని ఆలోచించినా అప్పట్లో సాధ్యం కాలేదు. ఈసారి కచ్చితంగా డబ్బులను ఆన్లైన్ లో చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. 50 ఆకులు గల ఒక తునికాకు కట్టకు రూ.2.05 చెల్లిస్తారు. తునికాకును సేకరించే వారు ప్రతిరోజూ రూ.500 నుంచి రూ. 800 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది.
నెలరోజుల పాటు పని ఉంటుంది..
తునికాకు సేకరణ ద్వారా మాకు నెల రోజులపాటు ఉపాధి లభిస్తుంది. వేసవి ఎండల దృష్ట్యా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు నాగులపల్లి అడవిలోకి వెళ్లి తునికాకును సేకరించి, ఇంటికి తీసుకొచ్చి.. కట్ట లు కట్టి సాయంత్రం సమయంలో గ్రామంలోని కల్లం లో విక్రయిస్తున్నా. ప్రతిరోజూ రూ.500 నుంచి రూ.600 వరకు సంపాదిస్తున్నా
-జయసుధ, నాగులపల్లి గ్రామం, పెద్దేముల్ మండలం
1900 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణే లక్ష్యంగా..
ఈ ఏడాది జిల్లాలోని ఆరు యూనిట్ల ద్వారా 1900 స్టాం డర్డ్ బ్యాగుల తునికాకును సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 50 ఆకులు గల ఒక తునికాకు కట్టకు రూ.2.05 చెల్లిస్తాం. జిల్లాలోని ఆరు యూనిట్ల పరిధిలో 49 కల్లాల్లో తునికాకును సేకరిస్తాం. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో తునికాకు సేకరణ ప్రారంభమైంది. మిగిలిన గ్రామాల్లోనూ రెండు, మూడు రోజుల్లో ప్రారంభం కానున్నది. తునికాకును విక్రయించిన వారికి డబ్బులు ఈ ఏడాది నుంచి ఆన్లైన్లో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-వేణుమాధవరావు, వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి