తాండూరు, మే 1: ప్రజల ఆరోగ్యం కోసం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి తాండూరు ‘బ్రాండ్’గా ఆర్గానిక్ కుసుమ నూనె, కంది పప్పును తయారు చేసి అమ్మకాలు జరిపేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నిర్ణయం తీసుకు న్నది. అందుకు తగ్గట్లు తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రూ.4.85 లక్షలతో నూనె తయారీమిషన్, రూ.1.25 లక్షలతో నూనె ఫిల్టర్ పరికరం, రూ.3 లక్షలతో కంది పప్పు తయారీ మిషన్ను తీసుకు వచ్చింది. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన రైతుల నుంచి మద్ధతు ధరకు కుసుమలు, కందులు కొనుగోళ్లు చేసి స్వచ్ఛమైన కుసుమ నూనె, కందిపప్పును వ్యవసాయ పరిశోధన కేంద్రంలో తయారు చేసి అమ్మకాలు జరపడం ప్రా రంభించారు. రసాయనిక ఎరువులు, మందులు వాడకుండా పండించిన పంటతో వందశాతం నాణ్యమైన, కల్తీలేని కుసుమ నూనె, కందిపప్పును మార్కెటింగ్ చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు.
నేరుగా బయట మా ర్కెట్లో అమ్మకాలు జరిపేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ స్టాండెడ్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ప్రత్యేకంగా లైసెన్స్ కూడా తీసుకున్నారు. కాగా 2 జూన్ 2020న సీఎం కేసీఆర్ తాండూరులో తయారు చేస్తున్న కుసుమ నూనె విక్రయాలను అధికా రికంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఏడాది 6 వేల లీటర్ల స్వచ్ఛమైన కుసుమ నూనె, 50 క్వింటాళ్ల ఆర్గానిక్ కంది పప్పును తయారు చేసి అమ్మకాలు జరిపేందుకు తాండూరు వ్యవసాయ కేంద్రంలో నిత్యం పనులు జరుగుతున్నాయి. తాండూరు వ్యవసాయ కేంద్రంలో పండించిన కుసుమ, కందులతో పాటు రైతుల నుంచి నాణ్యమైన ఆర్గానిక్ కందులు, కుసుమలు సేకరించారు. అందుకు రైతుల నుంచి మద్ధతు ధర రేటు కంటే ఐదు శాతం ఎక్కువ రేటును ఇచ్చి మంచి కం దులు, తెల్లకుసుమలు నిల్వ చేశారు. 100 కిలోల కుసుమల నుంచి 20 లీటర్ల నూనె వస్తుందని అలాగే 100 కిలోల కందుల నుంచి 60 కిలోల కంది పప్పు వస్తుందని శాస్త్ర వేత్తలు తెలిపారు. ప్రస్తుతం కుసుమ నూనె లీటరు రూ. 400, కంది పప్పు కిలో రూ.170 ధరకు అమ్మతున్నట్లు తెలిపారు.
పశువుల కోసం పౌష్టిక దాణా
కుసుమ నూనె తయారి ప్రక్రియలో పశువుల కోసం దాణా కూడా తయారవుతుంది. కుసు మలను మిషన్లో వేయడంతో అందులోని నూనెతో పాటు పిండి పదార్థం దాణాగా మారుతుంది. ఇది పశువుల ఆరోగ్యానికి చాలా మంచిదని పశు వైద్యులు, శాస్త్రవేత్తలు పే ర్కొంటున్నారు. గానుగ ద్వారా వచ్చిన పిండి పశువులకు అందిం చడంతో వాటి ఆరో గ్యం బాగుండడంతో పాటు కండర శక్తి పెరుగుతుందని దాని ద్వారా ఆవులు, గేదెల పాలు చిక్కబడుతాయని తెలిపారు. అందుకు రైతుల కోసం నాణ్యమైన దాణాను కూడా వ్యవ సాయ కేంద్రంలో అమ్మకానికి ఉంచారు. కిలో దాణాకు రూ.10 చొప్పున 25 కిలోల బస్తాను రూ.250కి అమ్ముతున్నారు. బయట మార్కెట్లో పశువుల దాణా రూ.25 నుంచి రూ.50కి అమ్ముతుండగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎలాంటి లాభం ఆశించ కుండా అమ్మడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాండూరు ‘బ్రాండు’లో పోషకాలు మెండు
కోల్డ్ప్రెస్డ్ కుసుమ నూనెతో శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తి స్థాయిలో అందుతాయి. బయట మార్కెట్ లో విక్రయించే నూనె తయారీలో నీళ్లు వేయడం, 175 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో వేడి చేసి గానుగ చేయడంతో నూనెలోని పోషకాలు నశిస్తాయి. తాండూరు ప్రాసెసింగ్ యూనిట్లో తయారు చేసే నూనెను ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తాం. చుక్క నీరు వేయకుండా, అధిక ఉష్ణోగ్రతతో వేడి చేయకుండా ఆధునిక సాంకేతిక పరికరాలతో నూనె తయారు చేస్తున్నాం. ఒక లీటరు, ఐదు లీటర్ల నూనె డబ్బాలు ప్యాక్ చేసి అమ్మకాలు జరుపుతున్నాం. తాండూరుతో పాటు హైదరాబాద్లోని ప్రధాన కొనుగోళు కేంద్రాల్లో, సూపర్ మార్కెట్లలో తాండూరు మంచి నూనె లభిస్తుంది.
తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో తయారు చేసిన కుసుమ నూనెతో ఎలాంటి వ్యాధులు దరి చేరవు. కొవ్వును తగ్గించి గుండె జబ్బుల నివారణకు చాలా మేలు చేస్తుంది. రక్త సరఫరా మంచిగా జరుగుతుంది. వెంట్రుకలు పెరగడంతో పాటు జుట్టు రాలడం తగ్గుతుంది. విటమిన్ ‘ఇ’ అధికంగా లభిస్తుంది. అదే విధంగా ఆర్గానిక్ ద్వారా పండించిన కంది పప్పు త్వరగా ఉడు కుతుంది. రుచిగా ఉండడంతో పాటు ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది.
–సుధాకర్, ప్రధాన శాస్త్రవేత్త, తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం