పరిగి, మే 1 : భూగర్భ జలాలను పెంచేందుకు ‘మిషన్‌కాకతీయ’తో రాష్ట్ర సర్కార్ చెరువులను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. అయితే భూగర్భ జలాలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. వికారాబాద్ జిల్లాలో 31 కొత్త చెరువుల నిర్మాణం చేపట్టడంతో పాటు 48 పాత చెరువుల పునరుద్ధరించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు ఒక్కో చెరువు నిర్మాణానికి రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 6వేల నుంచి 8వేల వరకు కూలీలకు పనిదినాలు కల్పించవచ్చంటున్నారు. ఈ పనులు వచ్చే ఆగస్టు 15వ తేదీ లోపు పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం చర్యలను ముమ్మరం చేస్తున్నది. ఈ 79 చెరువుల నిర్మాణం వల్ల జిల్లాలో అదనంగా 8లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగడంతో పాటు 0.028 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టడం ద్వారా భూగర్భ జలాలు పెరుగనున్నాయి. ఆ దిశగా ఉపాధిహామీ పథకం ద్వారా చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరోవైపు 4 నెలలపాటు ఉపాధిహామీ కూలీలకు చేతినిండా పని కల్పించేందుకు చెరువుల నిర్మాణం పనులు కొనసాగుతాయి. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 79 చెరువుల నిర్మాణ పనులను ఉపాధిహామీ ద్వారా చేపట్టనున్నారు. 31 కొత్త చెరువుల నిర్మాణంతోపాటు 48 పాత చెరువులను పునరుద్ధరణ చేయనున్నారు. ఇప్పటికే ప్రతి మండలం నుంచి ఎన్ని చెరువుల నిర్మాణం చేపడుతున్నది గుర్తించడంతోపాటు సర్వే పూర్తి చేశారు. గుర్తించిన స్థలాల్లో 13 కొత్త చెరువుల నిర్మాణం అటవీ భూముల్లో చేపట్టనుండగా, మిగతావి ప్రభుత్వ స్థలాల్లో చేపడుతారు. దీని ద్వారా జిల్లాలో అదనంగా 8లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం పెరగనుండగా 0.028 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తద్వారా జిల్లా పరిధిలో భూగర్భ జలాలు మరింత పెరిగేందుకు అవకాశముందని చెప్పవచ్చు.
ప్రతి మండలంలో చెరువుల గుర్తింపు..
వికారాబాద్ జిల్లాలో చెరువుల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఆయా గ్రామాలను గుర్తించారు. ప్రతి చెరువు నిర్మాణానికి సుమారు రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఉపాధిహామీ కూలీలకు ఒక్కో చెరువుకు సంబంధించి 6వేల నుంచి 8వేల పనిదినాలు కల్పించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 2,00,069 మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ లక్ష మందికిపైగా పనులకు వస్తున్నారు. ఈ సంఖ్య మే నెలలో మరింత పెరుగనున్నది. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.
గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలుంటే రెవెన్యూ, లేకపోతే అటవీ అధికారులు, ఉపాధిహామీ ఉద్యోగులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించి, టెక్నికల్ టీమ్‌తో సర్వే చేయించడం జరిగింది. వర్షపు నీరు అధికంగా నిలువ ఉండే ప్రాంతాలను గుర్తించి కొత్త చెరువుల స్థలాలు ఎంపిక చేశారు. ఆయా మండలాల్లో ప్రభుత్వ, అటవీ స్థలాలు కొత్త చెరువుల నిర్మాణానికి అనువుగా లేకపోతే కుంటలు, చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించారు. కొత్తగా నిర్మాణం చేపట్టే చెరువులను ఒక ఎకరం విస్తీర్ణంలో చేపడుతారు. ఇందులో 3 మీటర్ల లోతు వరకు మట్టిని తీయడంతోపాటు కట్ట నిర్మాణం, రిబిట్మెంట్, మత్తడి, తూము పనులు చేపట్టనున్నారు. ప్రతి కొత్త చెరువులో 10వేల క్యూబిక్ మీటర్ల నీరు నిలువ ఉండాలన్నది ప్రధాన ఉద్దేశం.
ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి..
చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ చేపట్టే పనులు ఆగస్టు 15వ తేదీ లోపు పూర్తయ్యే విధంగా పనులు చేపట్టనున్నారు. ప్రతి చెరువు వారీగా ఎంత మంది కూలీలకు ఎన్ని పనిదినాలు కల్పించాలి, ఎంత ఖర్చవుతుందనేది ఉపాధిహామీ సాంకేతిక సహాయకులు అంచనాలు రూపొందిస్తున్నారు. తద్వారా ప్రతిరోజూ పనులు వేగంగా జరిపించేందుకు వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వేసవిలోనే కూలీలకు వ్యవసాయ పనులు ఉండకపోవడం వల్ల అత్యధికంగా పనులు జరిగేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
79 చెరువుల పనులు గుర్తించాం
వికారాబాద్ జిల్లా పరిధిలో 79 చెరువుల పనులు గుర్తించాం. ఈ పనులకు సంబంధించి ఉపాధిహామీ టెక్నికల్ టీం అంచనాలు తయారు చేశారు. సాధ్యమైనంత త్వరగా చెరువుల పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఆగస్టు 15వ తేదీలోపు చెరువుల పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యంగా నిర్దేశించాం. చెరువుల నిర్మాణంతో ఉపాధి కూలీలకు పనులు లభించడంతోపాటు భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. – నిఖిల, వికారాబాద్ కలెక్టర్