షాద్నగర్, మే 1 : రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి శరవేగంగా విస్తరిస్తున్నది. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో పీ అండ్ జీ అంతర్జాతీయ కాస్మోటిక్స్ ఉత్పత్తుల సంస్థ మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఆరేండ్ల కింద పీ అండ్ జీ సంస్థ ఉత్పత్తుల పరిశ్రమను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అదే సంస్థకు చెందిన లిక్విడ్ డిటర్జెంట్ ఉత్పత్తి పరిశ్రమను సోమవారం ఉదయం 10 గంటలకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్, పరిశ్రమ ప్రధాన ప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమ నెలకొల్పడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనున్నదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ ప్రారంభోత్సవం సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.