పరిగి, ఏప్రిల్ 27 : జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో పనుల గ్రౌండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులకు సూచించారు. బుధవారం డీపీఆర్సీ భవనంలో మన ఊరు-మన బడి కార్యక్రమం పనుల పురోగతిపై కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..జిల్లాలో మొదటి దశలో 371 పాఠశాలలు మన ఊరు-మన బడి కింద ఎంపిక చేయగా, ఇప్పటివరకు కొన్ని మండలాల్లో ఎస్టిమేషన్లు పూర్తిగా అప్డేట్ కాలేదన్నారు. త్వరలో పనులు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. లీడ్ స్టేట్మెంట్లు, ఇన్పుట్ డాటా ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక నివేదికలను డీఆర్డీవో ద్వారా తనకు పంపిస్తే పరిపాలన అనుమతులు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి పాఠశాల ఎంవోయూ జనరేట్ చేసి సంబంధిత అధికారుల, పంచాయతీలో తీర్మానం పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అంశాలపై మండల విద్యా శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, వివిధ ఇంజినీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దళితబంధు యూనిట్లు గ్రౌండింగ్ చేయాలి
దళితబంధు యూనిట్లను పకడ్బందీగా గ్రౌండింగ్ చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాలులో గ్రౌండింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం దళితబంధు పథకం అమలు చేస్తుందన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో 100 మంది, తాండూరులో 100, పరిగిలో 80, కొడంగల్‌లో 60, చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలంలో 18 మంది, మొత్తం 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఇప్పటివరకు 274 మందికి రూ.27.27కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. 76 మంది పౌల్ట్రీ, డైయిరీ తదితర నిర్వహణకు నిధులు అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ విభాగానికి సంబంధించిన చెల్లింపులు వెంటనే పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. వివిధ వ్యాపారాల నిర్వహణకు అద్దె చెల్లింపుల కోసం అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు అందజేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, జడ్పీ డిప్యూటీ సీఈవో సుభాషిణి, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, పశు సంవర్ధక శాఖ అధికారి అనిల్‌కుమార్, ఎల్డీఎం రాంబాబు, ఎంవీఐ జెసెఫ్ పాల్గొన్నారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం డీపీఆర్సీ భవనంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్ పదో తరగతిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మే 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు సంబంధించి, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి, విద్యా శాఖ సహాయ సంచాలకులు గని, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.