ఆమనగల్లు, ఏప్రిల్ 22 : ఎండకాలం వచ్చిందంటే చాలు సేద తీరేందుకు కాలక్షేపం కోసం ప్రతి ఒక్కరూ ఈతపై ఆసక్తి చూపడం సహజం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో బావులు, చెరువులు, కుంటల వద్దకు పరుగులు తీసి పిల్లలు ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు. ఈత కొట్టడానికి చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఆసక్తి కనబరుస్తారు. ఈత కెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొకపోతే సరదామాటున పిల్లల విలువైన ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది. చిన్నారులు ఈతకు తీసుకెళ్లే సమయంలో పెద్దలు జాగ్రత్తలు పాటించి చిన్నారులకు ఈత నేర్పించాల్సి ఉంది. పలు ప్రమాదాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. సరదా కోసం బావులు, కుంటల్లోకి ఈత కొట్టేందుకు వెళ్లి విలువైన ప్రాణాలు పోయిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి.
అజాగ్రత్తగా ఉంటే అంతే…
ఎండకాలం ఈత సరదా చిన్నారులకు ప్రాణహాని తెచ్చిపెడుతుంది. అప్పటివరకు తమ కండ్ల ముందు ఉన్న చిన్నారులు బావులు, కుంటల వద్దకు తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. సంబంధిత అధికారులు వేసవి కాలంలో కాల్వలు, కుంటలు, చెరువులు, బావుల్లో ఈత కోసం వెళ్లకుండా తగు జాగ్రత్తలు కూడిన అవగాహన సదస్సులు చేపడితే తప్ప ప్రమాదాలు తప్పేలా లేవు.
నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలి..
జిల్లాల్లో ఎండకాలం వచ్చిందంటే చాలు ఈ లాంటి ప్రమాదాలు ప్రతియేటా తరుచుగా జరుగుతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు ప్రమాదాలు చోటుచేసుకొనే చెరువులు, కుంటలు, బావులను గుర్తించి అక్కడ ప్రమాదాలు కాకుండా ప్రమాద సూచిక నోటీసు బోర్డులు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకోవాలి. పల్లెల్లో ప్రమాదాలు జరుగకుండా క్షేత్రస్థాయి అవగాహన చర్యలు చేపట్టాలి.
ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈతకెళ్లే సమయంలో తప్పనిసరిగా వారికి తోడుగా తల్లిదండ్రులు లేదా సహాయకులు తప్పనిసరిగా వెళ్లాలి.
పిల్లలకు ఆముదం బెండు, ఆనకాయ బుర్ర, రబ్బరు ట్యూబ్‌లు, తాళ్లు వంటివి ఉపయోగించాలి.
బావులు, కుంటలు, చెరువుల్లో లోతుపై అవగాహన కలిగి ఉండి ఈతకు దిగాలి.
రాతికట్టడం బావులు, చెరువులు వద్ద డైవ్‌లు వేయవద్దు. ప్రమాదవశాత్తుపై నుంచి దూకే సమయంలో రాళ్లపై పడే అవకాశం ఉంటుంది.
తలకిందుల ప్రమాదవశాత్తు డైవ్ కొట్టరాదు. ప్రమాదవశాత్తు బావుల సమీపంలో ఉన్న దరికి గట్టిగా తల ఢీకొని ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నది.
చెరువులోకి ఈతకు వెళ్లే ముందు అక్కడ లోతైన గుంతలు, పూడిక మట్టి, నాచు గురించి తెలుసుకోవాలి.
ఈత కొట్టే సమయంలో భయపడి పక్కవారిని గట్టిగా కౌగిలించుకుంటే ఇద్దరికీ ప్రమాదం ఉంటుంది.
ప్రమాదవశాత్తు నీటిలోకి మునిగిన తరువాత వారిని కాపాడి వారు నీటిని తాగి ఉంటే శ్వాస ఆడేందుకు సులువుగా నీటిని కక్కించాలి
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడితే ఛాతిపై ప్రథమ చికిత్స చేసి ఛాతిపై రుద్దాలి. అప్పుడే ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన నీరు బయటకు వస్తుంది.
నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తాం..
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపడుతాం. చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. తల్లిదండ్రులు పిల్లలను ఈతకు తీసుకెళ్లేటప్పుడు తప్పనిసరిగా వారి వెంట ఉండాలి. తోటి పిల్లలతో కలిసి ఈతకు వెళ్తుంటే వారిని పంపించొద్దు. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. పట్టణంలో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు అనుమతిలేకుండా ఈత కొలనులను ఏర్పాటు చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాం.
– శ్యామ్‌సుందర్, మున్సిపల్ కమిషనర్