షాబాద్, ఏప్రిల్ 22 : పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు సహకరించాలని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ కోరారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాల్లో సంబంధిత శాఖల అధికారులతో 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై డీఆర్వో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గత రెండేండ్ల అనంతరం పూర్తిస్థాయిలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు సెల్ఫోన్లు తీసుకురావద్దని, ముఖ్యంగా పోలీస్, ట్రాన్స్పోర్ట్, పోస్టల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులు, అధికారులందరూ అందుబాటులో ఉండాలని, పోలీసుశాఖ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు, ప్రశ్నా పత్రాల తరలింపు కోసం ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పరిసర ప్రాంతంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. డిప్యూటీ తాసీల్దార్ స్థాయి అధికారులను ఫ్లయింగ్ స్క్వార్డ్‌గా నియమించాలని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షకు ఆర్టీసీ బస్సులు అన్ని రూట్లలో నడిపించాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి పరీక్ష కేంద్రంలో ఏఎన్ఎంలను ఏర్పాటు చేసి అవసరమైన మెడికల్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, తాగునీరు సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్షలు పూర్తి అయ్యే వరకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో మొత్తం 47,540 మంది రెగ్యులర్ విద్యార్థులు, 44మంది సప్లిమెంటరీ విద్యార్థులు 283 పరీక్షా కేంద్రాల్లో పరీక్షకు హాజరవుతున్నారని, 31 పోలీస్ స్టేషన్లలో ప్రశ్న పత్రాలు భద్రపరుస్తున్నట్లు చెప్పారు.
ఇంటర్ పరీక్షలకు సమన్వయంతో పని చేయాలి
ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, సాఫీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు. మే 6 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో మొదటి సంవత్సరం 59,694, రెండో సంవత్సరం 55,672 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, ఇందుకోసం 156 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై లైన్ డిపార్ట్మెంట్స్ అయిన విద్య, వైద్య, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో డీఆర్వో మాట్లాడారు. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. ఈ పరీక్షలు సాఫీగా నిర్వహించేందుకు ఒక తాసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ర్, జూనియర్ లెక్చరర్‌తో ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను, నలుగురు జూనియర్ లెక్చరర్లతో సిట్టింగ్ స్కాడ్ బృందాలను, 35మంది సభ్యులతో కస్టడియన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
29 పోలీస్ స్టేషన్లలో భద్రపరుస్తున్న ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటు 156 పరీక్షా కేంద్రాలకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీప జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని, 12మంది ఫ్ల్లయింగ్ స్కాడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంక్యానాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి సుసీందర్రావు, పోలీసు శాఖ అధికారులు, జిల్లా ట్రెజరీ అధికారి, కలెక్టరేట్ కార్యాలయ తాసీల్దార్ జయశ్రీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.