షాద్‌నగర్/ షాద్‌నగర్ టౌన్, ఏప్రిల్ 20 : ఒక ఆలోచన అందరినీ ఆకట్టుకుంటుంది. అందరి మెప్పు పొందడమే కాకుండా ప్రజలను కూడా చైతన్యవంతం చేస్తుంది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తే ఆ సంతోషమే వేరు. అలా ప్రజాప్రతినిధులు, అధికారుల్లో వచ్చిన ఓ ఆలోచన నేడు రాష్ట్రమంత్రుల చేత కూడా ప్రశంసలు పొం దుతున్నది. వ్యర్థాలను సక్రమంగా వినియోగిస్తే వాటి ద్వారా ఎంత ప్రయోజనం చేకూరుతుందో తెలిసేలా షాద్‌నగర్ మున్సిపాలిటీ పాలకమండలి, అధికారులు చేపట్టి న త్రిపుల్ ఆర్ కార్యక్రమం ప్రజలందరి మెప్పు పొందుతున్నది. ప్రజలు తాగి పడేసిన ఖాళీ కొబ్బరి బొండాలతో ఎన్ని ప్రయోజనాలను పొందొచ్చో మున్సిపల్ అధికారులు, పాలకులు చేసి చూపించా రు. ఖాళీ కొబ్బరి బొండాల్లో మొక్కల పెంపకం, కొబ్బరి నారా తయారీ, సేంద్రియ ఎరువు తయారీ వంటి పలు పనులకు శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి పనితీరును ఇటీవల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మెచ్చుకుని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ట్రిపుల్ ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్) పేరుతో షాద్‌నగర్ మున్సిపాలిటీలో విస్తృతంగా మొక్కలను పెంచాలని మున్సిపల్ పాలకమండలి, మున్సిపల్ కమిషనర్ భావించారు. అందులో భాగంగా పారిశుధ్య కార్మికులు రోజువారీగా సేకరించే వ్యర్థాల్లో నుంచి ఖాళీ కొబ్బరి బొండాలను వేరు చేసి…వాటిలో మట్టిని నింపి విత్తనాలను నాటుతున్నారు. మొక్కలుగా మారిన అనంతరం బొండంతోపాటు భూమి లో పాతున్నారు. అంతేకాకుండా కుళ్లిపోయిన బొండాలతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
కొబ్బరి నార, నారతో ఉన్న కొబ్బరి బొండాల నుంచి కొబ్బరి నార ను వేరు చేసి తాళ్లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం షాద్‌నగర్ మున్సిపాలిటీ మిలీనియం టౌన్షిప్లో మున్సిపాలి టీ ఆధ్వర్యంలో వన నర్సరీ, స్మృతివనాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారు వెయ్యికిపైగా ఖాళీ కొబ్బరి బొం డాల్లో మొక్కలను పెంచుతున్నారు. సేంద్రియ ఎరువును కూడా తయారు చేస్తున్నారు. ఖాళీ కొబ్బరి బొండాల్లో మొక్కలను పెంచడం ద్వారా మొక్కల పెంపకానికి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లను పూర్తిస్థాయిలో అరికట్టొచ్చు. వినూత్న ప్రయోగంతో ఖాళీ కొబ్బరి బొండాల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టిన కమిషనర్‌ను, ప్రజాప్రతినిధులను ప్రజలు అభినందిస్తున్నారు.
ఖాళీ కొబ్బరి బొండాల్లో మొక్కలను పెంచుతున్నాం. దీంతో మొక్కలకు వాడే ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించొచ్చు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఖాళీ కొబ్బరి బొండాల్లో సుమారు 1000 కి పైగా మొక్కలను పెంచుతున్నాం. కుళ్లిపోయిన బొండాలతో సేంద్రియ ఎరువు, నార తో ఉన్న బొండాలతో నార తాళ్లను తయారు చేస్తున్నాం. మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న ప్రయోగాన్ని ప్రశంసించిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
-జయంత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ షాద్‌నగర్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
సరికొత్త ఆలోచనలతో ఖాళీ కొబ్బరి బొండాల్లో మొక్కలను పెంచుతున్నాం. అందులో మొక్కలు బాగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మొక్కలకు వా డే ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించొచ్చు. మొక్కలు నాట
డం ప్రతి ఒక్కరి బాధ్యత.
–కొందూటి నరేందర్, మున్సిపల్ చైర్మన్ షాద్‌నగర్