ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 19: జిల్లాలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 27న పండుగలా జరుపాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు జిల్లాలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపాలని నిర్ణయించినట్లు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌తో పోరాడి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని కొనియాడారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని అన్నారు.
ఎందరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్పందించకున్నా రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈనెల 22న మంత్రి సబితారెడ్డి సమక్షంలో జిల్లాకోర్ కమిటీ సమావేశం జరుగుతుందని, 24న మండల, మున్సిపల్ కార్యవర్గ సమావేశాలను జరిపి ప్రణాళికలు రూపొందించుకునేలా మంత్రి పలు సూచనలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో అనుబంధ సంఘాల బాధ్యులు కూడా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, క్రియాశీలక సభ్యులు వేడుకల్లో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.
మూడు రోజుల పాటు వేడుకలు
పార్టీ ఆవిర్భావ వేడుకలను ఈనెల 24, 25, 26 తేదీల్లో మూడు రోజుల పాటు జిల్లాలోని అన్ని గ్రామాలు, అన్ని వార్డుల్లో పండుగలా నిర్వహించాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడంతోపాటు రోడ్లు, వీధుల్లో గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా మీదుగా ఉన్న నాగార్జునసాగర్-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్ రహదారులతోపాటు చేవెళ్ల, శ్రీశై లం, శంషాబాద్ ప్రధాన రహదారుల్లో గులాబీ జెండాలను అలంకరించే బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధు లు, పార్టీ మండలస్థాయి, గ్రామస్థాయి బాధ్యు లు తీసుకోవాలన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకలు జయప్రదం అయ్యేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బుగ్గరాములు తదితరులు పాల్గొన్నారు.