రంగారెడ్డి, ఏప్రిల్ 18, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రక్రియను వేగవంతం చేస్తున్నది. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో 2,637 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయగా, మే నెలాఖరు వరకల్లా 2000 ఇండ్లను అర్హులకు కేటాయించే దిశగా జిల్లా గృహ నిర్మాణ శాఖ ముమ్మరంగా చర్యలు చేపట్టింది. టీఎస్టీఎస్ నుంచి అందిన 2బీహెచ్‌కే లబ్ధిదారుల జాబితా ప్రకారం జిల్లాలో 3,420 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ నెలాఖరులోగా ఎంపికైన అర్హుల ఇంటింటికీ వెళ్లి సొంత కారు, సొంతిల్లు ఉన్నదా… గతంలో సర్కారు ఇల్లు వచ్చిందా.. కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉందా.. అన్న తదితర అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. అంతేకాకుండా గ్రామ సభల్లోనూ లబ్ధిదారుల జాబితాను ప్రకటించి, ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి కమిటీకి జాబితాను అందజేయనున్నారు. అనంతరం కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత పారదర్శకంగా ఎంపికైన అర్హులకు ఇండ్లను కేటాయించనున్నారు.
పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా.. అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర సాంకేతిక విభాగం ఇప్పటికే అర్హులను తేల్చింది. సొంత కారు, సొంతిల్లు, గతంలో ప్రభుత్వం ద్వారా ఇండ్ల మంజూరు, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని అధికారులు నిజమైన పేదలను అర్హులుగా ఎంపిక చేశారు.
టీఎస్టీఎస్ ద్వారా అందిన అర్హుల జాబితా ప్రకారం జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారులు విచారణను చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2 వేల ఇండ్లను మే నెలాఖరులోగా లబ్ధిదారులకు కేటాయించే దిశగా ఉన్నతాధికారులు ముందుకెళ్తున్నారు. జిల్లాకు మొత్తం 23,908 ఇండ్లు మంజూరు కాగా.. ఇప్పటికే 2,637 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. వీటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదలు పంపగా త్వరలో నిధులు విడుదలకానున్నాయి.
3,420 లబ్ధిదారులు…
జిల్లాలోని ఫరూఖ్‌నగర్, కొత్తూరు, నందిగామ, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మంచాల, గండిపేట, శంషాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల నుంచి 5,223 దరఖాస్తులురాగా 3,428 దరఖాస్తుదారులను రాష్ట్ర సాంకేతిక విభాగం అర్హులుగా తేల్చింది. సోమవారం నుంచి ఈ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి విచారణ చేపడుతున్నారు. పది మండలాలకు చెందిన అర్హుల జాబితాను గృహ నిర్మాణ శాఖ అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. కలెక్టర్ ఆమోదించిన వెంటనే జాబితాను ఆయా మండలాల తహసీల్దార్లకు పంపనున్నారు. తహసీల్దార్లు, హౌజింగ్ శాఖకు సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో విచారణను పూర్తి చేయనున్నారు.
ఎంక్వైరీ అనంతరం జాబితాను ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించి జాబితాను ప్రకటించనున్నారు. గ్రామసభల్లో ఎలాంటి అభ్యంతరాలు రానట్లయితే ఆ జాబితాను జిల్లా స్థాయి కమిటీకి అందజేసి ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించనున్నారు. ఇండ్ల పంపిణీని పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నారు. రిజర్వేషన్ల ప్రకారం ఇండ్లను కేటాయించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలకు25 శాతం, ఎస్టీలకు 25 శాతం, మైనార్టీలకు 7 శాతం, ఎక్స్-సర్వీస్మెన్లకు 2 శాతం, పీహెచ్‌సీలకు 5 శాతం, మిగతా 36 శాతం ఇతరులకు అందించనున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 12 శాతం, ఎక్స్-సర్వీస్మెన్లకు 2 శాతం, పీహెచ్‌సీలకు 5 శాతం, మిగతా 58 శాతం ఇతరులకు అందిచనున్నారు.
అదేవిధంగా 2,637 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా త్వరలోనే మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మండలంలోని బండరావిరాలలో 35 ఇండ్లు, హమీదుల్లానగర్‌లో 20 ఇండ్లు, బైరాగిగూడలో 50 ఇండ్లలో మౌలిక వసతులను కూడా కల్పించగా.. కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంక్వైరీలో భాగంగా ఫరూఖ్‌నగర్ మండలంలోని తిమ్మాపూర్, నందిగామ మండలాలకు వర్క్ ఇన్స్పెక్టర్లుగా రాజవర్దన్‌రెడ్డి, మహేశ్వరం మండల వర్క్ ఇన్స్పెక్టర్గా చంద్రయ్య, చేవెళ్ల, రాజేంద్రనగర్ మండలాల వర్క్ ఇన్స్పెక్టర్గా రామచంద్రయ్య నియమితులయ్యారు. ఇప్పటివరకు పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లను నియోజకవర్గాలవారీగా ఇలా ఉన్నాయి. షాద్‌నగర్ 1880, ఇబ్రహీంపట్నం 335 , మహేశ్వరం 192, రాజేంద్రనగర్ 130 ఇండ్లు, చేవెళ్ల 100 ఇండ్లను నిర్మించారు.