మొయినాబాద్, ఏప్రిల్ 18: చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం చక్రతీర్థంతో ముగిశాయి. వారం రోజులుగా ఉత్సవాలను అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. సోమవారం ఉద యం ఆలయంలోని అద్దాల మహల్లో స్వామివారికి ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. అనంతరం భూదేవీశ్రీదేవి సమేతంగా స్వామివారిని పల్లకిపై ఆలయ గర్భగుడి చుట్టూ ఊరేగించారు. శివాలయ ప్రాంగణంలోని మండపంలోకి తీసుకొచ్చి బాలాజీతోపాటు చక్రస్వామికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణతో కార్యక్రమం కనుల పండువగా జరిగింది. దీంతో ఆలయ పరిసరాల్లో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొన్నది. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్, కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు రంగరాజన్, రంగాచార్యులు, నరసింహరాజన్, సురేశ్స్వామి, కన్నయ్యస్వామి, మురళి, కిట్టుస్వామి, అనిల్, పవన్ పురోహితులు పూజలు నిర్వహించారు.
గండిపేట జలాశయంలో స్వామి వారికి చక్రస్నానం
ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి అర్చకులు చక్రస్నానం చేయించారు. స్వామివారిని ఊరేగింపుగా గండిపేట జలాశయంలోకి తీసుకెళ్లి వేదమంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల మధ్య చక్రస్నానం నిర్వహించా రు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోని అద్దాల మహల్లో ఆసీనులను చేశారు. బ్రహ్మోత్సవాల ప్రాధాన్యతను పూజారి రంగరాజన్ భక్తులకు వివరించారు. బ్రహ్మోత్సవాలకు చివరి రోజు కావడంతో సోమవారం ఆలయం కిటకిటలాడింది. అర్చకులు మహాద్వార దర్శనాన్ని కల్పించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకు న్నా రు. సాయంత్రం ధ్వజారోహణం, ద్వదశారాధనంతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు అర్చకులు తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడం తో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.